హసన్‌పర్తి, జూలై 19 : ఎంహెచ్ఆర్డీ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)లో ఎస్సార్ యూనివర్సిటీ సత్తాచాటింది. ఇంజినీరింగ్ విభాగంలో ఎస్సార్ కాలేజీకి దేశవ్యాప్తంగా 91వ స్థానం లభించింది. అలాగే, యూనివర్సిటీల స్థాయిలో 150లోపు స్థానంలో నిలిచిందని ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్ ఏ వరదారెడ్డి తెలిపారు. అనంతసాగర్‌లోని ఎస్సార్ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఎన్ఐఆర్ఎఫ్ను 2015లో స్థాపించినట్లు తెలిపారు. ఈ సంస్థ ఏటా దేశంలోని అన్ని విద్యాసంస్థలో విద్యాబోధన విధానాలు, మౌలిక సదుపాయాలు, విద్య నేర్చుకునే విధానాలు, వృత్తివిద్యా పరిశోధనలు, అన్వేషణలు, విద్యార్థులకు సాంకేతిక మెళకువలు, వారి ఉద్యోగావకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని విద్యాసంస్థలకు ర్యాంకులు కేటాయిస్తుందని తెలిపారు.
ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ ఈ నెల 15న ఢిల్లీలోని ైస్టెన్ ఆడిటోరియంలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లు విడుదల చేశారని తెలిపారు. ఇందులో ఎస్సార్ కళాశాలకు దేశంలోనే 91వ ర్యాంకు లభించిందని చెప్పారు. అలాగే, యూనివర్సిటీల స్థాయిలో 101-150 విభాగంలో ఉందని, ఓవరాల్‌గా 151-200 విభాగంలో ఉందని వివరించారు. రాష్ట్రంలో కేవలం ఎస్సార్ ఇంజినీరింగ్ కాలేజీ మాత్రమే ఇంజినీరింగ్ విభాగంలో 100 లోపు స్థానం సాధించిందని తెలిపారు. ఎస్సార్ కాలేజీలోనిఅన్ని డిగ్రీ కోర్సులు ఎన్బీఏతో టైర్-1 కింద గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ జీఆర్సీ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఇంజినీరింగ్ కాలేజీ 91వ స్థానం సాధించడం రాష్ర్టానికే గర్వకారణమన్నారు.
ఇది యూనివర్సిటీలోని బోధనా విధానం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిత్య పరిశోధనలు, అన్వేషణలపై యూనివర్సిటీకి ఉన్న నిబద్ధతకు కొలమానమన్నారు. యూనివర్సిటీలో పరిశోధనకు గాను ఎస్సార్ ఇన్నోవేషన్, ఎక్సేంజ్, నెస్ట్ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ డిజైన్, సెంటర్ ఫర్ ఏఐ అండ్ డిప్ లెర్నింగ్, సెంటర్ ఫర్ క్రియేటివ్ కాంగ్నిషన్, సెంటర్ ఫర్ ఎంబెడెడ్ అండ్ ఐవోటీ, సెంటర్ ఫర్ ఎమర్జింగ్ ఎనర్జీ టెక్నాలజీస్, సెంటర్ ఫర్ ఎక్స్‌పెరిమెంటర్ లెర్నింగ్, కొలబోరేటరీ ఫర్ సోషన్ ఇన్నోవేషన్, సెంటర్ ఫర్ మెటీరియల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, సెంటర్ ఫర్ కన్స్ట్రక్షన్ మెథడ్స్ అండ్ మెటీరియల్స్ వంటి అనేక విభాగాలను నెలకొల్పినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సీవీ గురురావు, డీన్ డాక్టర్, ఆర్ అర్చనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల సాధించిన విజయాలు