భారీ వర్షాలతో వరద పోటెత్తి ములుగు ఏజెన్సీ ప్రాంతాన్ని అతలాకుతలం చేయగా జలవిలయంలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న బాధితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొండంత ధైర్యమిచ్చారు. జోరువానను సైతం లెక్కచేయకుండా వరద ప్రభావిత ఏటూరునాగారంలో పర్యటించి, కాలినడకన ముంపు ప్రాంతాల్లో కలియదిరిగి ప్రజలను పరామర్శించడంతోపాటు ములుగు జిల్లాకు తక్షణ సాయం కింద రూ.2.50కోట్లు, భూపాలపల్లికి రూ.2కోట్లు, మహబూబాబాద్‌కు రూ.1.50కోట్లు ప్రకటించి బాధితుల్లో భరోసా నింపారు. వరద పరిస్థితిని పరిశీలించేందుకు ఆదివారం మధ్యాహ్నం ఏటూరునాగారం వచ్చిన సీఎం.. ముంపు ప్రాంతాల్లో గ్రామస్తులతో కలిసి ముందుకుసాగారు. ఈ సందర్భంగా రామన్నగూడెం పుష్కరఘాట్‌లో గోదారమ్మకు పూజలు చేసి సారె సమర్పించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో సీఎస్ సోమేశ్‌కుమార్, మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, తదితరులతో సమీక్షించారు. వరద ముప్పు తప్పేవరకు జిల్లాలో ఒక హెలికాప్టర్ అందుబాటులో ఉంటుందని, అలాగే ములుగుకు బస్‌డిపో, మున్సిపాలిటీ హామీతో తీపి కబురు చెప్పారు.
ములుగు, జూలై17(నమస్తేతెలంగాణ)/ఏటూరునాగారం : వరద బాధితులకు నేనున్నానని.. అధైర్యపడొద్దని సీఎం కేసీఆర్ అభయమిచ్చారు. భారీ వర్షాలతో ఏటూరునాగారంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురికాగా పరిశీలించేందుకు ఆదివారం మధ్యాహ్నం 1:30గంటలకు వాజేడు మండలం మండపాక హెలిప్యాడ్ వద్ద దిగారు. అక్కడినుంచి కాన్వాయ్ ద్వారా నేరుగా ఏటూరునాగారం ఐటీడీఏ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3గంటలకు రోడ్డు మార్గంలో రామన్నగూడెం పయనమయ్యారు. అక్కడి సెల్‌టవర్ నుంచి పుష్కరఘాట్ వరకు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన గ్రామస్తులతో కలిసి చేరుకున్నారు. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నదీ ప్రవాహాన్ని పరిశీలించి గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి చీరె, సారె, పసుపు, కుంకుమ సమర్పించారు. భారీ వర్షాలు, వరదలను లెక్కచేయకుండా తమను పరామర్శించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్‌ను చూసిన రామన్నగూడెంతో పాటు ఏటూరునాగారంవాసులు మురిసిపోయారు.
సమన్వయంతో పనిచేయాలి..
భవిష్యత్‌లో వరద ముంపుతో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత నిర్మాణాలు చేపడతామని సీఎం కేసీఆర్ బాధితులకు హామీ ఇచ్చారు. వరదలు వచ్చినప్పుడల్లా రామన్నగూడెంలో నష్టం జరుగుతున్నదని, దీని కోసం అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వరద తగ్గుముఖం పట్టగానే అధికారులందరూ వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి, తగిన చర్య లు తీసుకుంటారని బాధితులకు ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. వరద ప్రమాదం నుంచి ప్రజలను బయట పడేసిన ప్రజా ప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. సమీక్షలో పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ఏటూరునాగారం వరకు సాగిన పర్యటనల్లో సీఎం వెంట మంత్రులు టి.హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్, ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, గండ్ర వెంకట రమణారెడ్డి, శంకర్‌నాయక్, ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, డాక్టర్ టి.రాజయ్య, ఎమ్మెల్సీలు ఎస్.మధుసూదనాచారి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తకళ్లపల్లి రవీందర్రావు, బండా ప్రకాశ్, రెడ్కో చైర్మన్ ఏరువ సతీష్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంతరావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా, హనుకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, వరంగల్ కలెక్టర్ డాక్టర్ బి.గోపి, సింగరేణి సీఎండీ శ్రీధర్, ములుగు ఎస్పీ సంగ్రామ్ జి.పాటిల్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, జడ్పీవైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, జడ్పీటీసీలు సకినాల భవాని, తుమ్మల హరిబాబు, గై రుద్రమదేవి, జడ్పీకోఆప్షన్ మెంబర్ వలియాబీ, ఎంపీపీలు గండ్రకోట శ్రీదేవిసుధీర్‌యాదవ్, అంతటి విజయ, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నేడు హైదరాబాద్‌కు పయనం..
హనుమకొండ/సుబేదారి : హనుమకొండ నుంచి ఆదివారం ఉదయం బయల్దేరిన సీఎం కేసీఆర్.. భద్రాచలం, ఏటూరునాగారంలో పర్యటన ముగించుకొని రాత్రి తిరిగి హనుమకొండలోని మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసానికి చేరుకున్నారు. ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రమే వచ్చిన ముఖ్యమంత్రి రెండో రోజూ కెప్టెన్ ఇంట్లోనే బస చేశారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఉదయం హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. సీఎం బసచేస్తున్న సందర్భంగా కెప్టెన్ నివాస పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. పర్యటన ఏర్పాట్లను సీపీ తరుణ్‌జోషి నేరుగా పరిశీలించారు. ములుగు నుంచి ఏటూరునాగారం, భద్రాచలం దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యటన సాగగా, కమిషనరేట్‌తో పాటు భూపాలపల్లి, ములుగు జిల్లా పోలీసుల పెద్ద ఎత్తున మోహరించారు. అందరి సమన్వయంతో పర్యటన సాఫీగా సాగింది.
ములుగుకు బస్‌డిపో, మున్సిపాలిటీ..
ములుగుకు ఆర్టీసీ బస్‌డిపో మంజూరు చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గ్రామపంచాయతీ కేంద్రంగా ఉన్న జిల్లాకేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తానని కూడా మాటిచ్చారు. ఏటూరునాగారం మండలకేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించారు. అలాగే ప్రజల రవాణా కష్టాలను ప్రజాప్రతినిధుల నుంచి తెలుసుకున్న సీఎం కేసీఆర్ బస్సుల సంఖ్యను పెంచి ప్రతి మారుమూల ప్రాంతానికి బస్సు నడిపేలా కృషి చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ఆదేశించనున్నట్లు తెలిపారు. వరద ముంపు ప్రాంత ప్రజల సౌకర్యాల ఏర్పాటు కోసం రూ.200 కోట్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10వేల నగదుతో పాటు నిత్యావసర సరుకులను అందించనున్నట్లు తెలిపారు. దీని కోసం జిల్లా కలెక్టర్‌కు వరద విపత్తుల నిమిత్తం ఖర్చు చేయడానికి రూ.2కోట్లను విడుదల చేసినట్లు సీఎం వెల్లడించారు.
9 మండలాలను కవర్ చేసిన ముఖ్యమంత్రి
వరద బాధితులకు అండగా ఉండేందుకు ములుగు జిల్లాకు విచ్చేసిన సీఎం తన పర్యటన తొమ్మిది మండలాలను కవర్ చేశారు. ములుగు మండలం మహ్మద్‌గౌస్‌పల్లి నుంచి రోడ్డు మార్గంలో జిల్లాకేంద్రం పరిధిలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాలను పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా వెంకటాపురం(నూగూరు), వాజేడు మండలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుతో జలమయమై, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదల్లో చికుకున్న గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలిస్తూ సీఎం ఏటూరునాగారంలోని రామన్నగూడెం చేరుకొని గంట పాటు పర్యటించారు. ముంపు ప్రాంతాల ప్రజలను తరలించే క్రమంలో ఇంటి నిర్మాణాల కోసం అటవీ శాఖ అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దని డీఎఫ్ఓ ప్రదీప్‌కుమార్ శెట్టిని మందలించారు. శాపల్లి వద్ద చేపట్టిన హెలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు అటవీశాఖ అధికారుల అడ్డంకులతో ఆగిపోయాయని సీఎం కేసీఆర్ డీఎఫ్‌ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహించే సమయంలో ప్రజల అవసరాలను గుర్తెరిగి విధులను నిర్వహించాలన్నారు. భారీ వరదలు వచ్చినప్పటికీ సహాయక చర్యల్లో ముందుండి భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
నాడు ఉద్యమనేతగా. . నేడు సీఎంగా రామన్నగూడెం పుష్కరఘాట్‌పై పూజలు
ఏటూరునాగారం, జూలై 17: నాడు ఉద్యమకారుడిగా ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి తల్లి ఒడిలో పూజలు నిర్వహించిన కేసీఆర్, ఆదివారం సీఎం హోదాలో ప్రత్యే క పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ 2003లో జరిగిన గోదావరి పుష్కరాలు ముగిసిన తర్వాత కేసీఆర్ రామన్నగూ డెం పుష్కరఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఎల్లా ప్రగడ సూర్యనారాయణశర్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోదావరి నదికి పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వరదలతో రామన్నగూడెం ముంపు బారిన పడుతున్న విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆదివారం పుష్కరఘాట్‌ను సందర్శించారు. గోదావరి పరవళ్లను వీక్షించారు. రామన్నగూడెం గ్రామంలోని ఎస్సీ కాలనీ నుంచి నడుస్తూ పుష్కరఘాట్ వరకు చేరుకుని రామన్నగూడెం స్థితిగతులను పరిశీలించారు. అనంతరం నాడు పూజలు చేసిన అర్చకులు సూర్యనారాయణశర్మ మంత్రోచ్ఛారణలు చేయగా ప్రత్యేక పూజల్లో సీఎం పాల్గొన్నారు. అదే ఒడ్డున తిరిగి పూజలు నిర్వహించిన తీరు రామన్నగూడెం వాసులు చర్చించుకుంటున్నారు. అయితే రామన్నగూడేనికి వరద ముప్పు రాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం హామీ ఇవ్వడం పట్ల సర్పంచ్ దొడ్డ కృష్ణ,ఎంపీటీసీ సుమలత శ్రీనువాస్ కృతజ్ఞతలు తెలిపారు.