జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంటున్నాయి. ఐదో రోజు బుధవారం నల్లబెల్లి మండలం మేడపల్లిలో అత్యధికంగా 7.5, వర్ధన్నపేటలో అత్యల్పంగా 2.12 సెంటీమీటర్ల వర్షం పడింది. సగటు వర్షపాతం 4.18 సెంటీమీటర్లుగా నమోదైంది. జిల్లాలోని 815 చెరువుల్లో 254 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పాకాల సరస్సులో నీటి మట్టం 29 అడుగులకు చేరింది. వరద నీరు ప్రవహిస్తున్న నర్సంపేట- మాదన్నపేట రూటులో కల్వర్టును అదనపు కలెక్టర్ హరిసింగ్ సందర్శించి ముందుజాగ్రత్తలపై స్థానిక అధికారులకు సూచనలు చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాళ్ వివిధ మండలాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు.
జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామంలో అత్యధికంగా 7.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత నల్లబెల్లి మండల కేంద్రంలో 7.45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దుగ్గొండి మండల కేంద్రంలో 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో వాన దంచికొట్టింది. ఈ రెండు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లావ్యాప్తంగా 50.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖానాపురంలో 5.58 సెంటీమీటర్లు, వరంగల్‌లో 4.6, నర్సంపేటలో 4.42, గీసుగొండలో 4.32, చెన్నారావుపేటలో 3.92, సంగెంలో 3.42, నెక్కొండలో 3.1, పర్వతగిరిలో 2.72, రాయపర్తిలో 2.42, వర్ధన్నపేటలో 2.12 సెంటీమీటర్ల వర్షం పడింది. జిల్లా సరాసరి వర్షపాతం 4.1.8 సెంటీమీటర్లుగా నమోదైంది. ఐదో రోజూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వాన ఏకధాటిగా పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాగులు, ఒర్రెల్లో నీటి ప్రవాహం పెరిగింది.
చెరువుల్లోకి వరద ఉధృతి కొనసాగుతోంది. నీటితో నిండి చెరువులు పరవళ్లు తొక్కుతున్నాయి. అలుగు పోస్తున్న చెరువుల సంఖ్య పెరిగింది. జిల్లాలోని 815 చెరువుల్లో బుధవారం వరకు 254 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వీటిలో ఒక నల్లబెల్లి మండలానికి చెందినవే 44 ఉండడం విశేషం. నెక్కొండలో 40, నర్సంపేటలో 38, ఖానాపురంలో 23, పర్వతగిరిలో 23, చెన్నారావుపేటలో 26, రాయపర్తిలో 16, సంగెంలో 13, గీసుగొండలో 19, దుగ్గొండిలో 7, వరంగల్‌లో 3, వర్ధన్నపేటలో 1, ఖిలావరంగల్‌లో 1 చెరువు అలుగు పోస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. మరో 420 చెరువుల్లో నీరు 75 నుంచి 100 శాతం వరకు చేరినట్లు ప్రకటించారు. ఇంకో 119 చెరువుల్లో 50 నుంచి 75, పదిహేను చెరువుల్లో 25 నుంచి 50, మిగిలిన ఏడు చెరువుల్లో 25 శాతం లోపు నీరు చేరినట్లు తెలిపారు. తాజాగా, దుగ్గొండి మండలం నాచినపల్లిలోని ఈదులచెరువు కట్టకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ మండలంలోని మందపల్లి గ్రామం వద్ద ఎస్సారెస్పీ డీబీఎం-40లో ఎల్-1 కెనాల్‌కు రెండుచోట్ల గండ్లు పడ్డాయి. జలవనరుల శాఖ అధికారులు ఇక్కడ రైతులతో కలిసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. నర్సంపేట- మాదన్నపేట రూటులో కల్వర్టు మీదుగా నీరు ప్రవహిస్తోంది. దీంతో జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ ఈ కల్వర్టును సందర్శించి ముందుజాగ్రత్తలపై స్థానిక అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన లోతట్టుప్రాంతమైన నర్సంపేట పట్టణంలోని ఎన్టీఆర్నగర్ను సందర్శించారు. ఇక్కడ వరద నీటి తొలగింపు కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మున్సిపాలిటీ అధికారులకు చెప్పారు. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో నీటి మట్టం 29 అడుగులకు చేరింది. దీని పూర్తిస్థాయి నీటి మట్టం 30.3 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 3.26 టీఎంసీలు. బుధవారం వరకు ఈ సరస్సులో నీటి నిల్వ 2.845 టీఎంసీలకు చేరినట్లు జలవనరుల శాఖ ఇంజినీర్లు వెల్లడించారు. వరద ప్రవాహం కొనసాగుతున్నందున నేడోరేపో పాకాల సరస్సు అలుగు పోసే అవకాశం ఉంది. రాయపర్తి మండలంలోని మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటి నిల్వ 0.421 టీఎంసీలకు చేరింది. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 0.867 టీఎంసీలు. మైలారం రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో 150 క్యూసెక్కులు ఉన్నట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. వరద నీరు పంటల్లో నిలిచిన నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాళ్ వివిధ మండలాల్లో పర్యటించారు. పత్తి, వేరుశనగ పంటలు, వరి నారును క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని ఆయా మండల స్పెషల్ ఆఫీసర్, తాసిల్దార్, ఎంపీడీవో, ఎంపీవో తదితరులతో కలిసి గ్రామాలను సందర్శించారు. ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలకు సూచనలు చేశారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు అధికారులు గురు, శుక్రవారం సెలవు ప్రకటించారు. చాంబర్ ఆఫ్ కామర్స్, గుమస్తాల విన్నపంతో రెండు రోజులు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. శని, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు జరుగుతాయని వెల్లడించారు.