గిర్మాజీపేట, జూలై 13 : తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేనితనంతో కొందరు కాంగ్రెస్ శ్రేణులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. నియోజకవర్గంలోని 25వ డివిజన్లో డ్రైనేజీ, పైప్‌లైన్ పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో చుక్కనీరు ఆగకుండా పనులు చేపట్టామన్నారు. 75 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి నాలుగేండ్లలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసి చూపించారని అన్నారు. మీరు ముంచిన ప్రజలను మేము కాపాడుకున్నాం.. నాడు వరదలొస్తే శివనగర్ మునిగేది..నేడు ఆ సమస్యను అధిగమించేలా చేశానని అన్నారు. నియోజకవర్గం మొత్తం పనులు జరగుతున్నాయని, దాని ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్నామన్నారు. పైప్‌లైన్ పనులు జరుగుతుంటే వర్షం వచ్చి నీళ్లు నిలుస్తున్నాయి తప్ప వేరే కారణం కాదనానరు. కాంగ్రెస్ నాయకులు నీతులు చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తూర్పు నియోజకవర్గానికి కాంగ్రెస్ శ్రేణులు పనిగట్టుకొచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు ఊరుకోరని.. వచ్చే ఎన్నికల్లో వాళ్లే బుద్ధి చెబుతారని ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ బస్వరాజు శిరీషాశ్రీమాన్, డివిజన్ ముఖ్యనాయకులు, సీఐ మల్లేష్‌యాదవ్ పాల్గొన్నారు.
కాజీపేట, జూన్ 13 : ఆన్లైన్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.10.25 లక్షలు కొల్లగొట్టారు. కాజీపేట సీఐ గట్ల మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు క్రిప్టో కరెన్సీ టెలిగ్రాం గ్రూప్‌లో యాడ్ చేశారు. మరికొంత మంది లైన్లోకి వచ్చి ఆన్లైన్లో ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయంటూ చాటింగ్ చేస్తూ నమ్మించారు. నమ్మిన సదరు వ్యక్తి వారి కంపెనీకి రూ.10.25 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. డబ్బులు అకౌంట్లోకి పడగానే మోసగాళ్లు చాటింగ్ చేయడం మానేశారు. దీంతో సైబర్ నేరగాళ్లు నమ్మించి మోసం చేశారని భావించిన బాధితుడు బుధవారం కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా టెలిగ్రాం, వాట్సాప్ తదితర గ్రూపు ల్లో యాడ్ చేస్తే వెంటనే గ్రూపుల నుంచి బయటకు రావాలని సీఐ సూచించారు.