ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమవుతోంది. ఉప్పొంగుతున్న వాగులకు తోడు వరద ప్రవాహానికి రోడ్లు, ఇళ్లలోకి నీరు చేరుతుండగా, లోతట్టు ప్రాంతాలు, లోలెవల్ వంతెనలు మునిగి రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. ఇక గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలుకాగా, అధికారులు వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కాళేశ్వరం వద్ద 15 మీటర్ల ఎత్తులో ప్రమాదకర స్దాయిలో ప్రవహిస్తోంది. దీంతో వరద పుష్కరఘాట్‌ను దాటి ఇండ్లు, పంట పొలాలను ముంచెత్తింది. ఇప్పటికే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి ఒడ్డుపై ఉన్న ఇండ్లల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించారు. అలాగే ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం(నూగూరు), మంగపేట మండలాల్లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం వద్ద 16.4, పేరూరు వద్ద 16.1 మీటర్లకు చేరుకుంది. వరదలతో పాటు ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ముంపునకు గురయ్యే ఆవాసాలను గుర్తించి జిల్లావ్యాప్తంగా 25 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సహాయక చర్యలు చేపట్టేందుకు 200మంది పోలీస్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. అలాగే రెస్క్యూ టీములను ఏర్పాటుచేసి స్పీడ్ బోట్లను అందుబాటులో ఉంచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణప సముద్రం రిజర్వాయర్, భీం ఘనపూర్ రిజర్వాయర్లు, మల్హర్ మండలం ఎడ్లపల్లిలోని బొగ్గుల వాగు నిండి మత్తడి పోస్తున్నాయి. భీం ఘన్పూర్ రిజర్వాయర్ కట్ట బలహీనంగా ఉండడం వల్ల అధికారులు ఇసుక బస్తాలను అడ్డువేశారు. ఇక భూపాలపల్లి మండలం గొర్లవీడు, వజినపల్లి, నేరేడుపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చికుకున్నాయి. గొర్లవీడు సమీపంలో లో లెవల్ కల్వర్టు, జంగేడు సమీపంలోని వాగు ఉప్పొంగుతున్నాయి. గొర్లవీడు, నేరేడుపల్లి గ్రామాల మధ్య ధనసముద్రం ఉప్పొంగి రోడ్డు తెగిపోయింది. దీంతో ఈ గ్రామాల ప్రజలు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ములుగు జిల్లా గోవిందరావుపేట, వాజేడు, ఏటూరునాగారం మండలాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ అంకిత్ పర్యటించారు.
లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో పర్యటించారు. అలాగే లక్నవరం వేలాడే వంతెన నుంచి మొదటి ఐలాండ్ వరకు, కాటేజీలు వరద నీటితో నిండిపోయాయి. భూపాలపల్లిలో 12.26 సెం.మీ వర్షం కురవగా, గణపురం మండలంలో అత్యధికంగా 16.34 సెం.మీ.గా నమోదైంది. ములుగు జిల్లాలో 14.62 సెం.మీ వర్షం పడగా వెంకటాపురం(నూగూరు)లో 22.26 సెం.మీగా నమోదైంది. భారీ వర్షానికి వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మనుగొండ నుంచి చంద్రయ్యపల్లి గ్రామానికి వెళ్లే లోలెవల్ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. బుధవారం పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని గ్రామ యువకులు చేతులపై ఎత్తుకొని వంతెన దాటించి 108 అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 13