ఎడతెరిపిలేని వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరతున్నది. జిల్లాలో వారం రోజుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సైతం ముసురు పడడంతో నర్మెటలో అత్యధికంగా 38.4 మి.మీ, కొడకండ్లలో అత్యల్పంగా 14.6 మి.మీ నమోదైంది. జే చొక్కారావు(దేవాదుల) ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన స్టేషన్‌ఘన్‌పూర్, చీటకోడూరు, అశ్వరావుపేట, గండిరామారం, బొమ్మకూరు, నవాబుపేట రిజర్వాయర్లలోకి వరద వస్తున్నది. వాతావరణం ఆశాజనకంగా ఉండడంతో వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మెట్ట పంటలైన పత్తి, పెసర, వేరుశనగకు ఢోకా లేకపోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు వరదలొస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లకు జలకళ వచ్చింది. వానకాలం పంటల సాగుకు వాతావరణం అనుకూలంగా మారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానతో రైతులకు ఊరట లభించింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో బోర్లు, బావులు, చెరువులు, కుంటల ఆయకట్టు కింద వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. బుధవారం సైతం పొద్దంతా ముసురు పడింది. దీంతో దేవాదుల జలాశయాల్లోకి వరదనీరు చేరుతున్నది. వానకాలం వాణిజ్య పంటలకు భరోసా కల్పించే రీతిలో పడుతున్న వర్షాలతో అన్నదాతలకు ఆశలు చిగురించాయి. మరోవైపు ముసురుతో ప్రజలు ఇంటి నుంచి బయట కాలుపెట్టలేని పరిస్థితి నెలకొనడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తొలకరి వానలతో మొలకెత్తిన పత్తి, ఇతర పంటలు నీట మునుగుతున్నాయి. మరో రెండురోజులు వర్షం ఇలాగే కొనసాగితే పంటల దిగుబడిపై ప్రభావం చూపుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది పెంకుటిల్లు పాక్షికంగా దెబ్బతినగా, పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. మరికొన్ని చోట్ల మట్టిరోడ్లపై బురదనీరు నిలిచి రాకపోకలకు అంతరాయం నెలకొంది.
జిల్లాలో 236.6 మి.మీ వర్షం..
జిల్లాలో 236.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా నర్మెటలో 38.4 మి.మీ, రఘునాథపల్లిలో 33.2, జఫర్‌గఢ్‌లో 25.2, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 24.2, జనగామలో 23.6, లింగాలఘనపురంలో 21.8, పాలకుర్తిలో 22.0, దేవరుప్పులలో 16.8, అత్యల్పంగా కొడకండ్లలో 14.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదైన జిల్లాగా ఉన్న జనగామ ప్రాంతంతో జడి వానలు, చిరుజల్లులు, ముసురు వర్షాలతో నేల తడవడం మినహా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అనుకున్న మేరకు నిండలేదు. ప్రస్తుతం కురుస్తున్న వానలతో భూగర్భ జల నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉన్నా వాణిజ్య పంటల దిగుబడి తగ్గుతుందని వ్యవసాయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 76.7 మిల్లీమీటర్లకు గానూ 173.0 మి.మీ కురిసింది. అయితే అధిక వర్షపాతం నమోదైనా వరదలు పొంగిపొర్లే భారీ వర్షాలు జిల్లాలో కురవకపోవడంతో దేవాదుల రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లోకి ఆశించిన మేరకు నీరు చేరడంలేదు. అయితే వాగులపై నిర్మించిన చెక్‌డ్యాములకు మాత్రం ఇప్పుడిప్పుడే జలకళ సంతరించుకుంటున్నది. ఇప్పటికే దేవరుప్పుల మండలంలో వాగులపై నిర్మించిన చెక్‌డ్యాములు నిండి అలుగు పారుతున్నాయి. జిల్లాలో 965 చెరువులకు గానూ కొడకండ్ల మండలంలోని ఏడు చెరువులు మాత్రమే అలుగు పారుతుండగా, జిల్లాలోని 53 చెరువుల్లోకి 25 శాతం, 542 చెరువుల్లోకి 25 శాతం నుంచి 50 శాతం వరకు, 191 చెరువుల్లోకి 50 నుంచి 75 శాతం వరకు, 172 చెరువుల్లోకి 75శాతం నుంచి 100శాతం వరకు నీటి మట్టాలు ఉన్నట్లు సాగునీటిశాఖ అధికారుల లెక్కలు చెబుతుండగా జిల్లాలోని ఆరు దేవాదుల రిజర్వాయర్లలో ఇప్పటి వరకు దాదాపు 60 శాతం నీటి నిల్వ ఉందని వారు స్పష్టం చేశారు.
పంట చేన్లలో వర్షపు నీరు
జనగామ రూరల్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మండలంలో ఎడతెరిపిలేకుండా ముసురు కురుస్తున్నది. ఉష్ణోగ్రతలు తగ్గి చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రోజుల నుంచి వానలు కురుస్తుండడంతో పంట పొలాల్లో నీరు చేరింది. పత్తి, పెసర, కంది, వేరుశనగ చేన్లలోకి వరదలు వస్తుండడంతో తెగుళ్లు సోకుతాయనే ఆందోళనలో రైతులున్నారు. మరోవైపు చలిగాలుల తీవ్రతతో రైతులు, కూలీలు వ్యవసాయపనులకు వెళ్లలేకపోతున్నారు. గ్రామాల్లో ప్రజలు సైతం ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. ఇండ్లనుండి ప్రజలు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. ఇదిలా ఉండగా పంట చేన్లలో వర్షపు నీరు చేరడంతో పొలాలకు రైతులు గండ్లు కొట్టి కిందకు వదులుతున్నారు.
వర్షాలతో నిలిచిన వరినాట్లు
బచ్చన్నపేట : మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, కుంటలకు వరదలొస్తున్నాయి. వారం రోజులుగా ముసురుకురుస్తుండడంతో పంటల సాగుకు రైతులు వెళ్లలేకపోతున్నారు. మరోవైపు పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరడంతో జలాశయాలను తలపిస్తున్నాయి. కట్కూర్ గ్రామ శివారులో వరి నాట్లు వేసేందుకు పొలాన్ని దున్ని సిద్ధంగా చేయగా ఎడతెరిపిలేని వానలతో వరదలొచ్చాయి. వర్షపు నీరు చేరడంతో నాట్లు వేయలేదు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు సూచనలు చేస్తున్నారు. తహసీల్దార్ భైరెడ్డి రాజేశ్, ఎంపీడీవో రఘురామకృష్ణ, ఎస్సై సృజన్‌కుమార్ బుధవారం పలు గ్రామాలను సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లు పలు చోట్ల కూలిపోగా బాధితుల వివరాలను తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టారు.