వర్ధన్నపేట, జూలై 9 : గుంతల మయమైన జాతీయ రహదారి(365)పై వేసిన బీటీ లేయర్ పదిరోజులకే దెబ్బతింటున్నది. ఇల్లంద-వర్ధన్నపేట గ్రామాల మధ్య బీటీరోడ్డు పూర్తిగా పాడైపోయి అధ్వానంగా మారింది. దీంతో రహదారిని మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడంతో పంథిని వద్ద, ఇల్లంద-వర్ధన్నపేట గ్రామాల మధ్య రోడ్డుపై అధికారులు పది రోజు ల క్రితం బీటీ లేయర్ వేయించారు. కానీ వేసిన పది రోజులకే బీటీ లేయర్ లేచిపోతున్నది. పలుచోట్ల బీటలువారుతున్నది. ప్రస్తుతం కురుస్తున్న తేలికపాటి వర్షాలకే రోడ్డుపై గుంతలు కూడా ఏర్పడుతున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు అధికారులు, కాం ట్రాక్టర్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు. భారీ వర్షాలు కురిస్తే బీటీ మొత్తం లేచిపోయి రోడ్డు మరింత అధ్వానంగా తయారయ్యే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు.
గత ఏడాది కూడా ఇదే పద్ధతిలో కట్య్రాల-ఇల్లంద గ్రామాల మధ్య వేసి బీటీ లేయర్ కూడా పది రోజుల్లోపే పాడైపోయింది. బీటీ రోడ్డు దెబ్బతిన్న విషయంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో అధికారులు స్పందించి దెబ్బతిన్న బీటీని తొలగించి కొత్తగా మరో లేయర్ వేయించారు. ఇదే తరహాలో ప్రస్తుతం వేసిన బీటీ లేయర్ కూడా లేచిపోతుండడంతో వాహనదారులు, ప్రజలు అధికారుల పనితీరును తప్పుబడుతున్నారు. రోడ్డు వేసిన సమయంలో అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే కాంట్రాక్టర్ నాసిరకంగా బీటీ వేశాడని పలువురు ఆరోపిస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు నడిచే ఈ రహదారిపై ప్రజలు, వాహనదారుల ఇబ్బందిని గుర్తించి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయిస్తే కొద్ది రోజులకే పాడైపోతుండడంపైఅసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మరింత అధ్వానంగా మారే పరిస్థితి ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు జాతీయ రహదారిపై వేసిన బీటీని పరిశీలించి మళ్లీ నాణ్యతతో పనులు చేయించి వాహనదారుల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.