వరంగల్, జూలై 9: నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రేటర్ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు, ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. వరద నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. జీడబ్ల్యూఎంసీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉంటూ పనులు చేస్తున్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. మేయర్ గుండు సుధారాణి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమస్యలు ఉంటే కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని కోరారు. కమిషనర్ ప్రావీణ్య అధికారులను అప్రమత్తం చేశారు. ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగంతోపాటు టౌన్‌ప్లానింగ్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వరుసగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు.
ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు
నగరంలోని లోతట్టు, ముంపు ప్రాంతాల్లో నిలిచిన నీటిని గ్రేటర్ సిబ్బంది వెంటనే స్పందించి మళ్లీస్తున్నారు. అప్పటికప్పుడు కచ్చా కాల్వలు తవ్వుతున్నారు. ప్రధాన రహదారుల్లో గుంతలను పూడ్చుతున్నారు. వరదనీరు సాఫీగా వెళ్లేలా నాలాల్లో వ్యర్థాలను తీసేస్తున్నారు. నాలాల వెంట ఉన్న పిచ్చి చెట్లను తొలగిస్తున్నారు. పెరికవాడ నాలా, హంటర్ రోడ్డులోని విమ్స్ ఆస్పత్రి రైల్వే ట్రాక్ నాలాల్లో జేసీబీలతో పూడికతీత పనులు చేపట్టారు. హనుమకొండలోని తిరుమల బార్ జంక్షన్ ప్రాంతంలో కచ్చా కాల్వలు తవ్వారు. మైసయ్యనగర్ వద్ద వరద నీటిని కల్వర్టులోకి మళ్లించారు. అలంకార్ బ్రిడ్జి వద్ద నాలాలో పూడిక తీత చేపట్టారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ వరద నీరు ఎక్కడ నిల్వ ఉండాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, కమిషనర్ ప్రావీణ్య జవహర్‌నగర్, సమ్మయ్యనగర్, పెద్దమ్మగడ్డ, నయీంనగర్, అలంకార్, కాకతీయకాలనీ నాలా ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూం
వర్షాల నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి సాయం కావాలన్నా కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన 1800 425 1980, 9701999645 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలి. 7997100300 వాట్సాప్ నంబర్లకు సమాచారం అందిస్తే వెంటనే స్పందించనున్నారు. కంట్రోల్ రూం 24 గంటలు పని చేయనుంది. 4 డీఆర్ఎఫ్ బృందాలు రాత్రి వేళ సేవలు అందించనున్నాయి. వాట్సాప్‌లో ఫొటోలు, డివిజన్ సమాచారం పంపిస్తే వెంటనే డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతాయి. స్పెషల్ టీం అధికారులు తక్షణమే సంబంధిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు.
కంట్రోల్ రూంను సంప్రదించాలి
నగరంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు, ముంపు కాలనీల ప్రజలు సత్వర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూంను సంప్రదించాలి. ప్రత్యేక డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాం. ముంపు నివారణకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు.
– గుండు సుధారాణి, మేయర్
స్పెషల్ టీం అధికారుల పర్యవేక్షణ
నగరంలో వరుసగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలి. ఇప్పటికే ముంపు నివారణ చర్యలు సిబ్బంది చేపడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను స్పెషల్ టీం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు వరద ముంపు సమాచారాన్ని అందించాలి.
– ప్రావీణ్య, కమిషనర్