వరంగల్, జూలై 8 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ సర్కారు, సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు.. అమలు చేస్తున్న పథకాలతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు భారీగా చేరుతున్నారు. తల్లిదండ్రులు సైతం వారి పిల్లలను పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు. అటు ప్రభుత్వం ఇటు ఉపాధ్యాయుల సమష్టి కృషితో సర్కారు స్కూళ్లు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. జిల్లాలో మొత్తం 648 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఈ విద్యా సంవత్సరం కొత్తగా 8,368 మంది విద్యార్థులు చేరారు. ఇందులో ప్రైవేట్ నుంచి వచ్చిన వారే 4,021 మంది ఉన్నారు. అలాగే, 321 మంది తెలుగు నుంచి ఇంగ్లిష్ మీడియానికి మారారు. ప్రధానంగా అన్ని స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా మౌలిక వసతులు సమకూర్చుతుండడంతో కొత్తగా చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.
రోజురోజుకూ ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల ఆదరణ పెరుగుతున్నది. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడు ల్లో చదివించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలకు గుడ్‌బై చెబుతున్నారు. దీంతో సర్కారు బడుల్లో కొత్త అడ్మిషన్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు 8,368 వచ్చినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో ప్రైవే ట్ స్కూళ్ల నుంచి వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లు 4,021 ఉండడం విశేషం.
విద్యకు ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టేందుకు ఇటీవల ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దేందుకు ‘మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి’ కార్యక్రమా న్ని రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారా మూడు విడుతల్లో ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక తయారు చేసింది.
తొలి విడుత లో అభివృద్ధి చేసేందుకు ముప్పై ఐదు శాతం బడులను ఎంపిక చేశారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూ ళ్లకు ఈ జాబితాలో చోటు కల్పించారు. వీటిని సందర్శించి పన్నెండు అంశాలపై అవసరాలను గుర్తించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)ల చైర్మన్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్‌లు, ఇంజినీర్లు కలిసి జిల్లాలో సెలక్ట్ చేసిన 223 స్కూళ్లలో చేపట్టాల్సిన పనులను ప్రతిపాదించారు. వీటికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే ఇంజినీర్లు అంచనాలు రూపొందించారు.
తర్వాత పాలనాపరమైన అనుమతులు పొంది తొలివిడుత ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇటీవల అభివృద్ధి పనులు ప్రారంభించారు. పలు స్కూళ్లలో ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రతి స్కూల్లో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. అభివృద్ధి పనులతో సర్కారు బడులు కార్పొరేట్‌కు దీటుగా తయారవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించినట్లు ఈ విద్యా సంవత్సరం అన్ని సర్కారు స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని అమల్లోకి తెచ్చింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రతి స్కూల్లో ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నది. ఇందుకోసం టీచర్లకు ఇటీవల శిక్షణ కూడా ఇచ్చింది.
క్యూ కట్టిన విద్యార్థులు..
‘మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి’ కార్యక్రమంతో స్కూళ్లు ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటుండడం, మౌలిక వసతులు సమకూరుతుండడం, నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం బోధన అందుబాటులో కి రావడంతో ఈ విద్యా సంవత్సరం కొత్త అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. ఇన్నాళ్లూ సర్కారు బడిలో నాణ్యమైన విద్య, ఇంగ్లిష్ మీడియం లేదని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపారు. ప్రై‘వేటు’ పాఠశాలల ఫీజుల భారం మోయలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బోధన, ట్యూషన్ ఫీజులతో పాటు బస్సు ఫీజుల కోసం అనేక మంది అప్పు చేశారు. రోజురోజుకూ ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారం పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి లో సర్కారు బడులను తీర్చిదిద్దుతుండడం, ఇంగ్లిష్ మీడియం బోధన అమల్లోకి తేవడంతో తమ కష్టాలు తప్పాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు మాన్పిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ల కు తోలేందుకు ఆయా పాఠశాలల నుంచి టీసీలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు టీసీ లు ఇచ్చేందుకు ససేమిరా అంటుండడంతో ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు టీసీలు లేకపోయినా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో కొత్త అడ్మిషన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ స్కూళ్లలో తొమ్మిది, పదో తరగతి చదువుతున్న విద్యార్థులకూ టీసీలు లేకపోయినా అడ్మిషన్ ఇవ్వాలనే డిమాండ్ వస్తున్నది.
బడిబాటతో సత్ఫలితాలు..
ఒకటో తరగతిలో కొత్తగా చేరే విద్యార్థులతో పాటు ప్రైవేట్ స్కూళ్ల నుంచి వరదలా వస్తున్న విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం కొత్త అడ్మిషన్ల సంఖ్య పరుగులు పెడుతున్నది. జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అంతకు ముందే జూన్ 3న ప్రభుత్వం బడి బాట కార్యక్రమం చేపట్టిం ది. జూన్ 30 వరకు కొనసాగింది. ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు ఇంటింటికీ వెళ్లి ఎన్రోల్మెంట్ చేశా రు. ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధిపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. దీంతో ఈ విద్యా సంవత్సరం సర్కారు బడుల్లో కొత్త అడ్మిషన్లు అనూహ్యంగా నమోదవుతున్నాయి. జిల్లాలో 648 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో బుధవారం వరకు 8,368 కొత్త అడ్మిషన్లు వచ్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వాసం తి చెప్పారు.
ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులు సహా ప్రైవేట్ స్కూళ్ల నుంచి 2 నుంచి 12వ తరగతి వరకు వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లు 4,021 ఉన్నట్లు ఆమె వెల్లడించారు. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో కొత్త అడ్మిషన్లు ఫుల్‌గా వస్తున్నాయి. కొత్త అడ్మిషన్ల నమోదులో వరంగల్‌లోని నరేంద్రనగర్ ఉన్నత పాఠశాల నంబర్‌వన్ స్థానంలో ఉంది. ఈ స్కూల్‌కు 229 కొత్త అడ్మిషన్లు వచ్చినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుంట రవికుమార్ వెల్లడించారు. నరేంద్రనగర్‌లోని పీఎస్‌లో 158, కరీమాబాద్‌లోని హైస్కూల్లో 155, నర్సంపేట జడ్పీహెచ్ఎస్లో 131, హనుమదేవల్ ఎంపీపీఎస్‌లో 130, కరీమాబాద్ పీఎస్‌లో 114, వరంగల్ కృష్ణకాలనీ హైస్కూల్లో 108, దేశాయిపేట హెచ్‌ఎస్‌లో 108, గీసుగొండ మండలం ధర్మారం జడ్పీహెచ్ఎస్లో 102, నర్సంపేటలోని బాలుర జడ్పీహెచ్ఎస్లో 102, మోడల్ జడ్పీహెచ్ఎస్లో 100కుపైగా కొత్త అడ్మిషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో పది ప్రభుత్వ పాఠశాలల్లో 70 నుంచి 90 వరకు కొత్త అడ్మిషన్లు నమోదైనట్లు వెల్లడించారు.
అందరి సహకారంతో ముందుకు..
– విజయ్‌కుమార్, కరీమాబాద్ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం
అందరి సహకారంతో పాఠశాలను ముందుకు నడిపించగలుగుతున్నాం. ప్రభుత్వం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నది. రానున్న రోజుల్లో పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం మరువలేనిది.