వరంగల్, జూలై 8 (నమస్తేతెలంగాణ): అధికారుల తీరుపై వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఎంపీ తీవ్రస్థాయిలో నిరసన వెలిబుచ్చారు. ఎందుకింత నిర్లక్ష్యమని దయాకర్ అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశం జరిగింది. ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్ బీ గోపి, అదనపు కలెక్టర్ హరిసింగ్, జడ్పీ సీఈవో రాజారావు, డీఆర్డీవో ఎం సంపత్రావుతోపాటు జిల్లాలోని ఎంపీపీలు, దిశా సభ్యులు, ప్రభుత్వ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయ, జిల్లా వైద్య, ఆరోగ్య, సంక్షేమ, విద్యా, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, పౌరసరఫరాలు, పురపాలక, జిల్లా పరిషత్, పంచాయతీ, రోడ్లు, భవనాలు, గనులు, భూగర్భశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ తదితర విభాగాల పనితీరు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమావేశంలో చర్చించారు. సభ్యులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు సభ్యులకు తెలియజేశారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం కార్యనిర్వాహక ఇంజినీరు(ఈఈ) శంకరయ్య పీఎంజీఎస్‌వై పథకం ద్వారా జిల్లాలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనుల వివరాలు వెల్లడించారు.
ఈ క్రమంలో జిల్లా పరిధిలోకి వచ్చే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో పీఎంజీఎస్‌వై పథకం నుంచి ఎన్ని రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారని ఎంపీ దయాకర్ ఈఈ శంకరయ్యను ప్రశ్నించారు. 15 రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు ఈఈ సమాధామిచ్చారు. దీనిపై ఎంపీ మాట్లాడుతూ ఈ 15 రోడ్లలో ఏ ఒక్క రోడ్డు పనుల ప్రారంభోత్సవానికి తనను పిలువలేదని, తన ప్రమేయం లేకుండానే పీఎంజీఎస్‌వై రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభించారన్నారు. చీఫ్ గెస్ట్‌గా తనను పిలువాల్సి ఉన్నట్లు గైడ్‌లైన్స్ కూడా ఉన్నాయని, కానీ అలా చేయలేదన్నారు. శిలాఫలకాలపై తన పేరును మూడు లేదా నాలుగో స్థానంలో పెట్టారన్నారు. కనీసం తనకు సమాచారం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు.
నిర్లక్ష్యం చేస్తున్నారు..
ప్రొటోకాల్ పాటించకుండా తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారో తప్పనిసరిగా తనకు తెలియాలని, లేకుంటే ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. జిల్లాలో పీఎంజీఎస్‌వై పథకం ద్వారా చేపట్టిన పనులను ఎప్పుడూ తన దృష్టికి తేలేదన్నారు. పనులపై రివ్యూ కోసం కూడా ఏ ఒక్కరోజు తనను సంప్రదించలేదన్నారు. ఏది కూడా తనకు తెలియకుండానే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదని సంక్షేమ శాఖ జిల్లా అధికారి శారదపైనా సీరియస్ అయ్యారు. దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా అర్హులైన శారీరక వైకల్యంగల వారికి మూడు చక్రాల బండి, చంక కర్రలు, బ్యాటరీ వీల్‌చైర్స్, క్యాలిపర్స్, మోటరైజ్డ్ వాహనాలు, మూగ, చెవిటి వైకల్యంగల వారికి శ్రవణ యంత్రాలు, ఫోర్జీ స్మార్టు ఫోన్లు, అంధులకు చేతికర్రలు, డైజీ ప్లేయర్లు, ఎంపీ3 ప్లేయర్స్, ల్యాప్‌టాప్స్‌ను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శారద వెల్లడించారు.
ఈ సమయంలో ఎంపీ దయాకర్ మాట్లాడుతూ ‘సంక్షేమ శాఖ ద్వారా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ట్రైసైకిళ్లు, ల్యాప్టాప్స్ పంపిణీ చేసినప్పునడు ఎప్పుడూ తనకు సమాచారం ఇవ్వలేదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలేవీ తనకు చెప్పడం లేదు. మీ శాఖలో ప్రొటోకాల్ పాటించడం లేదు. ఏ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం లేదు. నాకు సమాచారం ఉండాలి. ఎందుకంటే మేం ప్రజలకు చెప్పాలి కదా. మమ్మల్ని కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయండి’.. అని అన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను డీఏవో ఉషాదయాళ్ సమావేశంలో సభ్యులు వివరించారు. మనఊరు-మనబడి కార్యక్రమం అమలు తీరును డీఈవో వాసంతి తెలియజేశారు.
ఈ కార్యక్రం ద్వారా అభివృద్ధి చేసేందుకు తొలివిడుత జిల్లాలో 223 ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసిందని, వీటిలో పనులు కూడా దశలవారీగా ప్రారంభం అవుతున్నాయని ఆమె తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగత వరకు ఇంగ్లిష్ మీడియం బోధన అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ జరుగుతున్నట్లు వాసంతి తెలిపారు. జిల్లా నుంచి పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థుల్లో 92 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు కలెక్టర్ బీ గోపి ప్రకటించారు. దుగ్గొండి మండలంలోని విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణులు కావడం విశేషమని, పదో తరగతిలో ఉత్తీర్ణులైన జిల్లాలోని విద్యార్థులు, మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేసిన విద్యాశాఖ అధికారులు, టీచర్లకు ఆయన అభినందనలు తెలిపారు.