జఫర్గఢ్, జూలై 8 : రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడంతోపాటు అన్నివర్గాల కోసం గురుకులాలు ఏర్పాటు చేశారని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమంలోని విద్యార్థుల మధ్య తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రేగడితండా శివారులోని ప్రజాదరణ ఆశ్రమంలో కడియం శ్రీహరి తన 71వ పుట్టిన రోజు వేడుకలను ఆశ్రమ విద్యార్థులు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు.
కడియం శ్రీహరికి విద్యార్థులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ ఈ ఆశ్రమం ఓ దేవాలయమన్నారు. గాదె ఇన్నయ్య, పుష్ప దంపతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆశ్రమాన్ని నిర్వహించడం సాహసోపేతమన్నారు. పేద విద్యార్థులకు విద్య, ఆరోగ్యం కోసం ఐదేళ్లుగా కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూతనిస్తున్నామని శ్రీహరి అన్నారు. ముగ్గురు ఎంబీబీఎస్, నలుగురు ఇంజినీరింగ్, 10 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులను చదివిస్తున్నామని ఆయన వెల్లడించారు. తన రాజకీయ, ప్రజాజీవితంలో విద్యారంగ అభివృద్ధికే అధిక ప్రాధాన్యమిచ్చానని గుర్తు చేశారు.
ప్రజాదరణ ఆశ్రమానికి రూ.2 లక్షలు వితరణ
తన పుట్టిన రోజును పురస్కరించుకొని కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమానికి రూ.2 లక్షల విరాళాన్ని ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య పుష్ప దంపతులకు కడియం శ్రీహరి అందించారు. విరాళం అందించినందుకు ఇన్నయ్య, పుష్ప దంపతులు, విద్యార్థులు కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.