హనుమకొండ, జూలై 5 : కాకతీయ వైభవ సప్తాహాన్ని ప్రజల పండుగగా నిర్వహించననున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో అఖిలపక్ష నాయకులు, మేధావులు, అన్ని వర్గాల మత పెద్దలు, పలు సంఘాల నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సమావేశానికి హాజరైన పలువురు నాయకులు, మేధావులు, కవులు, కళాకారుల సూచనలు, సలహాలు ఇచ్చారు.
అనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ ఒక పండగ వాతావరణంలో కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించడంతో పాటు ముందుతరాలకు కాకతీయుల చరిత్ర తెలిసేలా కార్యక్రమాలు రూపొంచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 700 సంవత్సరాల క్రితం ఓరుగల్లును విడిచి వెళ్లిన కాకతీయులు ఛత్తీస్‌గఢ్‌లోని జగదేవపూర్‌లో ఉన్నట్లు చరిత్రకారుల ద్వారా తెలుసుకొని 22వ వారసుడు కమల్‌చంద్ భంజ్‌దేవ్ కాకతీయను ప్రభుత్వపరంగా సప్తాహ ఉత్సవాలకు ఆహ్వానించేందుకు అక్కడికి వెళ్లినట్లు తెలిపారు.
కాకతీయుల సెంటిమెంట్ ప్రకారం.. ఈ నెల 7న ఉత్సవాల ప్రారంభం రోజున ఉదయం 7గంటలకు కమల్‌చంద్ భంజ్‌దేవ్ వరంగల్ చేరుకుంటారని.. ఆయనకు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లుచేశామన్నారు. ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారని ఈమేరకు ఏర్పాట్లుచేయాలని దేవాదాయ శాఖ అధికారులకు చీఫ్ విప్ సూచించారు. అక్కడినుంచి పోచమ్మమైదాన్‌లోని రాణీరుద్రమదేవి విగ్రహం వద్ద పూలమాల వేసి ఖిలావరంగల్‌కు వెళ్తారన్నారు. అక్కడినుంచి తిరుగు ప్రయాణంలో వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించి పద్మాక్షి దేవాలయ ప్రాంతంలోని అసంపూర్ణంగా ఉన్న తోరణాలను పరిశీలిస్తారని తెలిపారు.
మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్ బయలు దేరుతారని, సాయంత్రం 7గంటలకు 777 ఫొటోలతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభిస్తారని చీఫ్ విప్ తెలిపారు. ఈ ఏడు రోజుల పాటు హనుమకొండలోని పబ్లిక్‌గార్డెన్ టౌన్‌హాల్, అంబేద్కర్‌భవన్, వడ్డెపల్లి బండ్, భద్రకాళి బండ్, ఖిలా వరంగల్‌లో ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలుంటాయని చెప్పారు. 10న చందుపట్ల వద్ద రాణీరుద్రమదేవి శాసనం, అలాగే 11న పానగల్లు సందర్శించే కార్యక్రమం ఉంటుందన్నారు.
ముగింపు కార్యక్రమం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో ఘనంగా నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. సమావేశానికి హాజరై సూచనలు సలహాలు చేసిన వాటిని కూడా పరిగణలోని తీసుకుంటామన్నారు. కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, కాకతీయ సామ్రాజ్య ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవం చేయాలని చీఫ్ విప్ కోరారు.
ఖిలా వరంగల్‌లో ఘన స్వాగతం
కాకతీయుల వారసుడు కమల్‌చంద్ భంజ్‌దేవ్ కాకతీయకు ఖిలా వరంగల్‌లో ఘన స్వాగతం పలుకనున్నట్లు ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు. ఖిలావరంగల్‌కు వచ్చే క్రమంలో మెట్టు దర్వాజ వద్ద నుంచే కమల్‌చంద్ బాంజ్‌దేవ్‌ను రథంలో తీసుకవెళ్లడంతో పాటు రథం ముందు 16 గుర్రాలు, 100 మంది సైనికులు, 10వేల మంది ప్రజలతో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఏడు రోజుల పాటు ఖిలా వరంగల్‌లోని ఖుష్‌మహల్ వద్ద కార్యక్రమలు నిర్వహిస్తామని చెప్పారు.
సువర్ణాక్షరాలతో లిఖించే ఘట్టం
కాకతీయ వైభవ సప్తాహం దక్షిణ భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించే ఘట్టమని కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. కాకతీయులది ప్రజా రంజక పాలన అని ఆయన పేర్కొన్నారు. 700 సంవత్సరాల తర్వాత కాకతీయలు 22వ వారసుడైన కమల్‌చంద్ భంజ్‌దేవ్ తన జన్మస్థలం, నేలతల్లి వద్దకు వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలుకాలన్నారు. వీరిని వరంగల్ ప్రజల ఆకాంక్ష మేరకే ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
ఘనంగా ఏర్పాట్లు
సప్తాహం విజయవంతానికి ఘనంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఆర్జీ హన్మంతు తెలిపారు. లోగో విడుదలైనందున బుధవారం హోర్డింగ్‌లు, లాలీపాప్స్ ఏ ర్పాటుచేస్తామన్నారు. అన్ని విద్యాసంస్థల్లో ఉపన్యాస, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఇండోర్ స్టేడియంలోనే కార్యక్రమాలుంటాయన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో మేయ ర్ సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, కల్చరల్ డైరెక్టర్ మనోహర్, కమిషనర్ ప్రావీణ్య, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ వెంకన్న, ఉద్యోగ సంఘాల నాయకులు ఎ.జగన్మోహన్రావు, ప్రవీణ్‌కుమార్, శ్రీనివాసరావు, గంగు ఉపేంద్రశర్మ, భద్రకాళి శేషు, శంకర్‌శర్మ, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు పాల్గొన్నారు.