కృష్ణకాలనీ, జూలై 3: సీఎం కేసీఆర్ కార్మిక, ఉద్యోగుల పక్షపాతి అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం (టీఆర్ఎస్కేవీ) అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల మహాసభ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్యే గండ్ర, వరంగల్ జడ్పీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కార్మికుల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తున్న కార్మిక సంఘం టీఆర్ఎస్ పార్టీ అనుబంధ టీబీజీకేఎస్ అని తెలిపారు. నేడు టీఆర్ఎస్కేవీ ఏర్పడటం చాలా సంతోషకరమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు మూడుసార్లు జీతాలు పెంచి ఆర్థికంగా ఆదుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో అంగన్వాడీ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీ చేస్తామని, భూపాలపల్లిలో రెండు ప్రాజెక్టులు ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాట్లాడుతూ చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ టీచర్లు అమ్మ వంటివారని అన్నారు. పిల్లలను అంగన్వాడీ సెంటర్కు పంపితే చదువుపై ఆసక్తి పెంచుతారన్నారు. జడ్పీ వైస్ చైర్ పర్సన్ కళ్లెపు శోభా రఘుపతిరావు, భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఈఎస్సై మెంబర్ మారయ్య, కౌన్సిలర్లు హారిక, మౌనిక, రేణుక, మమత, టీఆర్ఎస్ మహిళా అర్బన్ అధ్యక్షురాలు తిరుపతమ్మ పాల్గొన్నారు.