నర్సంపేట, జూన్ 20 : అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని విద్యార్థులు నిరసన తెలిపితే యావజ్జీవం విధిస్తారా? అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నర్సంపేటలో ఆయన మాట్లాడుతూ.. 2018లో శాశ్వత ప్రాతిపదికన ఎంపికైన ఆర్మీ అభ్యర్థులకు అగ్నిపథ్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ‘అదితప్పని నిరసిస్తే నిరుద్యోగుల ప్రాణాలు తీస్తారా? వారేమన్న తీవ్రవాదులా? గోద్రా అల్లర్ల నిందితులే దేశాలను ఏలుతుండగా, అలాంటిది తమ హక్కులను కాలరాయకండని నిరసిస్తే జీవితాలను నాశనం చేస్తారా? అని బీజేపీపై మండిపడ్డారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నల ఉసురు తీశారన్నారు. అగ్నివీరులను బీజేపీ ఆఫీసుల్లో గార్డులుగా పెట్టుకుంటామని మధ్యప్రదేశ్ బీజేపీ నేత కైలాస్విజయ్ వర్గీయ అంటే, కటింగ్ చేసి బతకొచ్చని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడడం దారుణన్నారు.
దేశ రక్షణకు ప్రాణ త్యాగానికైనా వెనుకాడని సైనికులపై దిగజారి మాట్లాడుతున్నారని, ప్రజలు బీజేపీకి దేశాన్ని పాలించే అవకాశమిస్తే అహంకారం నెత్తికెక్కి ఆ పార్టీ నేతలు ఇలాంటి చిల్లర కూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్న వాళ్లకు యావజ్జీవ శిక్ష వేస్తామంటూ ఆర్పీఎఫ్ ఎస్పీ అనురాధ, ఆర్మీ చీఫ్ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఆడ్డికిపావుశేరు అమ్ముతున్న, అన్యాయంగా వందల మంది రైతుల ప్రాణాలు తీసిన మోదీకి ఏ శిక్ష వేస్తారని ప్రశ్నించారు. దేశ సంపదను అంబానీ, అదానీలకు అప్పజెప్పుతూ రైతుల నడ్డి విరుస్తున్నారన్నారు. సిగ్గుంటే అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో రెండున్నర కోట్ల పైచిలుకు ఉద్యోగ ఖాళీలుంటే భర్తీ చేయని అసమర్థ ప్రధాని మోదీ అన్నారు. నిరుద్యోగులను బ్లాక్ మెయిల్ చేస్తే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ రక్షణ కవచంలా నిలబడతారని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. అసలు కాంగ్రెస్ బతికుందా? నిరుద్యోగుల జోలికి ఎవరు వచ్చిన ఘోరీ కడతామని హెచ్చరించారు.