వరంగల్, జూన్ 20 : వర్షాకాలం నేపథ్యంలో కాంట్రాక్టర్లు నిర్మాణాల సమయంలో ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి కాంట్రాక్టర్లు, బిల్డర్లతో సమావేశం నిర్వహించారు. నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మేయర్, కమిషనర్లు వారికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజల భద్రతే లక్ష్యంగా గ్రేటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు నిర్మాణాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మురుగు కాలువ నిర్మాణాల సమయంలో మ్యాన్ హోల్స్ మూసివేయాలని సూచించారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి వేళలో ప్రమాదాలు జరుగకుండా వాచ్మెన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
వర్షాకాలం నేపథ్యంలో ఫుట్‌పాత్‌ల మధ్య ఖాళీగా ఉంటే వాటిని పూడ్చివేయించాలని ఆదేశించారు. కార్మికులకు సేఫ్టీ మెటీరియల్ అందజేయాలన్నారు. గ్లౌజ్‌లు, బూట్లు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. నిర్దేశించిన అంశాలు వారం రోజుల్లో అమలు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై చర్యలతో పాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 30 వరకు సెల్లార్ తవ్వకాలు చేపట్టవద్దని బిల్డర్లను ఆదేశించారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో జరిగే ప్రమాదాలకు కాంట్రాక్టర్లే పూర్తి బాధ్యత వహించాలన్నారు. నింబంధనలు పాటించేలా టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. అనంతరం నిబంధనలు పాటిస్తామని కాంట్రాక్టర్లు, బిల్డర్లు అంగీకార పత్రాలను అందజేశారు. సమావేశంలో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, ఎస్ఈలు సత్యనారాయణ, నవీన్ చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, సీఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు, డీఈ, ఏఈ, టౌన్‌ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బల్దియా గ్రీవెన్స్‌లో వినతుల వెల్లువ
బల్దియా గీవెన్స్లో ప్రజలు పలు సమస్యలను కమిషనర్ ప్రావీణ్యకు విన్నవించారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలతోపాటు అక్రమ నిర్మాణాలు, రహదారుల ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయి. కాలనీల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. నల్లా కనెక్షన్ లేకున్నా పన్ను వస్తోందని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రీవెన్స్‌లో మొత్తం 58 వినతులు రాగా, టౌన్‌ప్లానింగ్‌కు 28, ఇంజినీరింగ్ విభాగానికి 22, ప్రజారోగ్యానికి 2, పన్నుల విభాగానికి 6 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, ఎస్ఈలు సత్యనారాయణ, ప్రవీణ్ చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, కార్యదర్శి విజయలక్ష్మి, డీఎఫ్‌వో కిశోర్, కమిషనర్ జోనా, హార్టికల్చర్ అధికారి ప్రిసిల్లా, వింగ్ అధికారులు పాల్గొన్నారు.