తొర్రూరు, జూన్ 20 : కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని.. ఇందుకోసం ఈ విద్యా సంవత్సరం నుంచే ‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం చుట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు అంబేద్కర్‌నగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమానికి ఆయన హాజరై చిన్నారులకు పలక, బలపం అందించి అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి బిడ్డ ప్రపంచ స్థాయిలో అన్నిరంగాల్లో రాణించేలా చదువుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మన ఊరు-మన బడి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7289.54కోట్లు కేటాయించిందన్నారు.
ప్రభుత్వ, స్థానిక సంస్థల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, అవసరమైన ఫర్నిచర్, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, టాయిలెట్లను ఈ నిధులతో సమకూర్చనున్నట్లు వివరించారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని బీజేపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేట్టన్నారు. మొదటి దశలో ప్రభుత్వం ఖర్చు చేస్తున్న రూ.3,497కోట్లలో రూ.2700 కోట్లు కేంద్రం నిధులేనంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధారాలతో నిరూపించాలని డి మాండ్ చేశారు. ఈ కా ర్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిని మించి రూపొందిస్తుంటే చూసి ఓర్వలేక బండి సంజయ్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు.
ఎనిమిదేళ్ల పాలనలో కేంద్రం రాష్ర్టానికి ఒక కేంద్ర విద్యాసంస్థను కూడా ఇవ్వలేదని, ఈ అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులెవరికీ ధైర్యం లేదని ధ్వజమెత్తారు. బేటీ బచావో-బేటీ పడావో నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మోడల్ స్కూళ్లను ఎత్తివేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచే ఆంగ్లమాధ్యమంలో బోధన అందిస్తోందని, విద్యార్థుల సౌలభ్యం కోసం ద్విభాషా పుస్తకాలను ముద్రించి ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల కోసం వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తొర్రూరు ప్రాంతాన్ని ఎడ్యుకేషన హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, రూ.25లక్షలతో అంబేద్కర్‌నగర్ పాఠశాలను అభివృద్ధి చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
విద్యార్థుల సంఖ్య 200కి మించితే మరో రూ.25లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టే స్థాయికి పాఠశాలలను తీర్చిదిద్దుతామని తెలిపారు. రూ.500 కోట్లతో మహబూబాబాద్‌లో జిల్లా ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేసి మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో అబ్దుల్‌హై, ఆర్డీవో రమేశ్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ పి.సోమేశ్వర్రావు, వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ రవీంద్ర, కమిషనర్ గుండె బాబు, తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎంఈవో గుగులోత్ రాము, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజసుకన్య, కౌన్సిలర్లు ధరావత్ సునీత జైసింగ్, గుగులోత్ శంకర్, తూర్పాటి సంగీత, నర్కూటి గజానంద్, దొంగరి రేవతీశంకర్, కర్నె నాగజ్యోతి, కో-ఆప్షన్ సభ్యులు గుండాల యాకాంత, జలకం శ్రీనివాస్, కుర్ర కవిత, పట్టణ పార్టీ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, నాయకులు రాయిశెట్టి వెంకన్న, బిజ్జాల అనిల్, ఆశయ్య, తదితరులు పాల్గొన్నారు.