మరిపెడ, జూన్ 20;సీఎం కేసీఆర్ ముందుచూపుతో అమలు చేస్తున్న పల్లె ప్రగతితో మరిపెడ మండలం ఎల్లంపేట అభివృద్ధి బాట పట్టింది. స్థానికులకు ఆహ్లాదం పంచేందుకు ఏర్పాటైన పల్లె ప్రకృతివనం చూడముచ్చటగా ఉన్నది. సెగ్రిగేషన్ షెడ్ వినియోగంతో గ్రామ పరిసరాలు ఎప్పడూ పరిశుభ్రంగా ఉంటున్నాయి. హరితహారం కార్యక్రమం ద్వారా ఊరు నందనవనంలా మారింది.
సీఎం కేసీఆర్ పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో అందివచ్చిన అవకాశాన్ని ఎల్లంపేట పాలకవర్గం సద్వినియోగం చేసుకుంటున్నది. జీపీకి మందజూరైన సాధారణమైన నిధులకు తోడు ఎమ్మెల్యే రెడ్యా తోడ్పాటుతో గ్రామం సర్వాంగసుందరంగా మారుతున్నది. రూ.6కోట్లతో 120 మందికి సకల వసతులతో కూడిన డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి లబ్ధ్దిదారులకు అందించారు. వ్యవసాయ క్షేత్రాలకు రూ. 2కోట్ల 80లక్షలతో తారురోడ్లు వేసి రైతులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించారు. దీంతో రైతులు మోటరు సైకిళ్లపై వ్యవసాయ క్షేత్రాలకు వెళ్తున్నారు. రూ.60లక్షలతో గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రేనేజీల నిర్మాణం చేపట్టడంతో ఊరు కాస్తా పట్టణకళను సంతరించుకున్నది.
గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెపకృతివనం స్థానికులకు ఆహ్లాదం పంచుతున్నది. చిన్నారుల కోసం ఆటస్థలం, క్రీడాపరికరాలు అందుబాటులో ఉన్నా యి. ఉదయం, సాయంత్రం పలువురు సేద తీరేందుకు, వ్యాయమం కోసం పల్లె ప్రకృతివనానికి వస్తున్నారు. హరితహారంతో కాలనీలు పచ్చని శోభను సంతరించుకున్నాయి. గ్రామస్తుల్లో పాలకవర్గం ఎప్పటికప్పుడు చైతన్యం కలిగిస్తూ తడి,పొడి చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్‌కు తరలిస్తుండడంతో ప్రజలకు సీజనల్ వ్యాధులు దూరమయ్యాయి. ఊరిలో రెండు నర్సరీలు ఉన్నాయి. ఇంటింటికీ సురక్షితమైన మిషన్ భగీరథ తాగునీరు అందుతున్నది. ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. వైకుంఠధామం నిర్మాణంతో అంతిమ కష్టాలు తీరాయి.
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి
ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ తోడ్పాటుతోనే గ్రామం సుందరంగా మారింది. సకల వసతులతో కూడిన 120 డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు అందించాం. ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తున్నాం. నిత్యం పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. వ్యవసాయ క్షేత్రాలకు రైతులు వాహనాలపై వెళ్లేలా తారు రోడ్లు వేశాం. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సర్పంచ్‌గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా.
– తాళ్లపల్లి శ్రీనివాస్, సర్పంచ్
ఎల్లంపేట ఆదర్శ గ్రామం
పల్లె ప్రగతితో ఎల్లంపేట ఆదర్శ గ్రామంగా నిలిచింది. సంపూర్ణమైన పారిశుధ్యం, హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణతో గ్రామంలో ఆహ్లాదకర వాతావారణం నెలకొంది. అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణంతో గ్రామం సుందరంగా తయారైంది.
– కేలోత్ ధన్సింగ్, ఎంపీడీవో