వర్ధన్నపేట, జూన్ 20 : ఆరుగాలం కష్టపడి ప్రజలకు అన్నం పెడుతున్న రైతులకు సేవలందిస్తే జీవితానికి సార్థకత లభిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్గా ఎన్నికైన కమ్మగోని స్వామిరాయుడు సోమవారం మంత్రిని హనుమకొండ క్యాంపు కార్యాలయంలో కలిసి పూల మొక్క అందించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్ని పదవులు చేపట్టినా రైతులకు సేవ చేయడంలోనే నిజమైన సంతోషం ఉందన్నారు. అనేక సమస్యలతో ఇబ్బందులు పడిన రైతాంగానికి సీఎం కేసీఆర్ తెచ్చిన సంస్కరణలతో ఎంతో ఊరట లభించిందన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో బాధ్యతలు నిర్వహించడం ఎంతో గర్వంగా భావించాలని సూచించారు. రైతుల ఇబ్బందులను గుర్తించి వ్యవసాయ మార్కెట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదన్నారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రైతులకు శక్తివంచన లేకుండా సేవలందించాలని చైర్మన్ స్వామిరాయుడుకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, రాయపర్తి ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, వైస్ చైర్మన్ గట్టు నర్సింహ్మాచార్యులు, డైరెక్టర్లు ఎనగందుల మురళీ, మహ్మద్ ఉస్మాన్, కుందూరు యాదగిరిరెడ్డి, వల్లపు వెంకటేశ్వర్లు, దొమ్మాటి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.