వరంగల్ చౌరస్తా, జూన్ 18: దామెర రాకేశ్‌ది ముమ్మాటికీ కేంద్రం చేసిన హత్యేనని ప్రజలు భావిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం ఎంజీఎం మార్చురీలో రాకేశ్ మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారు వెంటనే దేశ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పటిష్టంగా ఉండాల్సిన రక్షణ రంగంలో ఔట్సోర్సింగ్ విధానాన్ని అమలు చేయడం వంటి చర్యలు దేశ రక్షణను ప్రశ్నార్థకం చేస్తాయన్నారు. తక్కువ జనాభా కలిగిన దేశాల మాదిరిగా మన దేశంలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం కుట్ర పన్ని, రక్షణ రంగాన్ని కూడా అంబానీ, అదానీ కంపెనీలకు కట్టబెట్టేందుకు చూస్తోందని విమర్శించారు. గతంలో నల్ల చట్టాలను రూపొందించి రైతుల ప్రాణాలు తీసిందని, ఇప్పుడు అగ్నిపథ్ పేరుతో యువత ప్రాణాలను బలిగొంటున్నదని మండిపడ్డారు. ముందుగా బీజేపీ నాయకుల కుటుంబసభ్యులను అగ్నిపథ్‌లో చేర్చి అప్పుడు మాట్లాడాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు రేపేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలో ఇదొక భాగమని పేర్కొన్నారు. శ్రీకాంతాచారి బలిదానంతో తెలంగాణ ఉద్యమం ఉధృతమై కాంగ్రెస్ ఎలా తుడిచిపెట్టుకుపోయిందో.. ఇప్పుడు రాకేశ్ మృతితో దేశంలో బీజేపీ తుడుచుపెట్టుకుపోతుందన్నారు. రాకేశ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు అర్హత కలిగిన కుటుంబసభ్యులకు ఉద్యోగాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారని చెప్పారు.
నో కిసాన్, నో జవాన్ ఇప్పుడు బీజేపీ విధానం : చీఫ్‌విప్ దాస్యం
వ్యవసాయ రంగలో నల్ల చట్టాలు తెచ్చి రైతు హత్యలకు పాల్పడిన కేంద్రం, క్షమాపణలు చెప్పి మరీ వాటిని రద్దు చేసిందని, నేడు అగ్నిపథ్ పేరుతో యువకుల హత్యలకు పాల్పడుతోందని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. నో కిసాన్, నో జవాన్ అనే కొత్త విధానాన్ని ఇప్పుడు కేంద్రంలోని బీజే పీ సర్కారు పాటిస్తున్నదని, దేశ రక్షణ విభాగాన్ని నాశ నం చేసేందుకు కుట్ర పన్నిందని మండిపడ్డారు. యువ త ఉద్యోగావకాశాలను నీరుగార్చే అగ్నిపథ్‌ను శాశ్వతం గా తొలగించాలని డిమాండ్ చేశారు.
యువతను నిర్వీర్యం చేసేందుకే.. : ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
బీజేపీ ప్రభుత్వం ఉద్యోగావకాశాలను తగ్గించి దేశంలోని యువతను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. కార్పొరేట్ సంస్థలను రక్షణ రంగంలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం చేస్తున్న కుయుక్తులను యువత తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణులైన యువకులపై కాల్పులు జరపడం కేంద్రం చేస్తున్న హ త్యారాజకీయమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బీజేపీకి బుద్ధి చెప్పాలని, కేంద్రంలో బీజేపీ ఉన్నంతకాలం యువతను మోసం చేస్తూనే ఉంటుందని, అందుకే బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు.
శాంతిభద్రతలకు భంగం : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
శాంతిభద్రతలకు విఘాతం కలిగించి రాజకీయ లబ్ధిపొందాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే యువతకు ఉద్యోగావకాశాలను నీరుగార్చేందుకు అగ్నిపథ్ అని పేరుపెట్టి రక్షణ శాఖ నియామకా ల్లో కొత్త విధానానికి సిద్ధపడిందన్నారు. దేశ రక్షణలో పాలుపంచుకోవాలని కలలుగన్న యువకుడిని కాల్చిచంపిన కేంద్రం, దేశ యువతకు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. రక్షణశాఖ నియామకాల్లో పాత విధానాన్నే పాటించేలా చేసేదాకా పోరాడుతామన్నారు.
ఈ గతి మరొకరికి పట్టొద్దు : దామెర కుమారస్వామి, మృతుడి తండ్రి
ఆర్మీలో ఉద్యోగం చేయాలనేది తన కొడుకు కల అని, ఇందుకోసం ఎంతో కష్టపడ్డాడని ఫిజికల్ టెస్ట్ పాసై, రాత పరీక్ష కోసం ఎదురుచూస్తున్న సమయంలో బీజేపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తేవడంతో తన కొడు కు కలత చెందాడని రాకేశ్ తండ్రి కుమారస్వామి ఆవేద న వ్యక్తం చేశారు. కొత్త విధానంతో పూర్తిస్థాయి ఉద్యో గం సాధించడం కష్టంగా ఉంటుందని, ఎన్నో కలలు గంటున్న చాలా మంది పిల్లల జీవితాలను బీజేపీ ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాత విధానాన్నే అమలు చేసి తమ కొడుక్కు పట్టిన గతి మరే యువకుడికీ పట్ట కుండా చూడాలని ప్రాధేయపడ్డారు.
భుజాలపై మోసి..
శుక్రవారం అర్ధరాత్రి ఎంజీఎం వైద్యశాలకు రాకేశ్ మృతదేహం రాగా అతడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, చీఫ్‌విప్ దాస్యం వారిని ఓదార్చారు. అనంతరం మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు పెద్ది, గండ్ర వెంకటరమణారెడ్డి రాకేశ్ మృతదేహాన్ని తమ భుజాలపై మోసి ప్రత్యేక వాహనంలో చేర్చారు.