బచ్చన్నపేట, జూన్ 14 : సమైక్య పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణను సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. దీంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మంగళవారం మండలంలోని కేశిరెడ్డిపల్లిలో క్రీడా ప్రాంగణం, కట్కూర్లో మన ఊరు- మనబడి , ఎస్సీ కమ్యూనిటీహాలు భవనం, వీఎస్ఆర్ నగర్లో గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు ప్రశంసించారని గుర్తు చేశారు. పల్లెలు, పట్టణాలకు మిషన్‌భగీరథ పథకంతో స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారని ఆయన తెలిపారు.
వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్‌తోపాటు రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తుండడంతో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ముత్తిరెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, నర్సరీ ఉన్నాయని వివరించారు. ప్రతి పల్లె హరితశోభను సంతరించుకుందని, ప్రతి గ్రామం పరిశుభ్రంగా మారిందని కేంద్ర బృందాలు చెప్పడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. దళితబంధు పథకంతో అట్టడుగువర్గాలకు మేలు జరుగుతున్నదని, దీని మాదిరిగానే బీసీ బంధుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నదన్నారు.
ఆడబిడ్డల వివాహానికి రూ.లక్షా 116 ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనన్నారు. ఆసరా పథకంలో పింఛన్లు అర్హులందరికీ అందిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు మన ఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం కట్కూరు పాఠశాలలో విద్యార్థినికి మధ్యాహ్న భోజనం వడ్డించి సమస్యలు తెలుసుకున్నారు.
ఓర్వలేకే కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. కేంద్రానికి లక్షలాది కోట్ల రూపాయలను తెలంగాణ పన్నుల రూపం లో చెల్లిస్తున్నా మన వాటా గా రావాల్సిన నిధు లు ఇవ్వడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతీకృష్ణంరాజు, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, పీఆర్ డీఈ చంద్రశేఖర్, ఎంపీడీవో రఘురామకృష్ణ, ఏఈ శ్రీనివాస్‌రావు , ఎంఈవో భగవాన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు మల్లవరం దివ్యాఅరవింద్రెడ్డి, ముశిని సునీతారాజుగౌడ్, కోనేటి స్వామి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, నాయకులు గిరబోయిన అంజయ్య, బావండ్ల కృష్ణంరాజు, నరెడ్ల బాల్‌రెడ్డి, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, ముశిని రాజుగౌడ్, మల్లవరం అరవింద్‌రెడ్డి, కాలియ చిట్టిబాబు, నరేశ్, కర్ణాల వేణుగోపాల్, శ్రీశైలం, రాంబ్రహ్మం, ముశిని బాబుగౌడ్, కోల శ్రీనివాస్, ముశిని ఎల్లయ్య, ధనుంజయ్, సత్యనారాయణ, బిక్షపతి, కృష్ణవేణి, అన్నపూర్ణ, రాజు, రజితారంజిత్రెడ్డి, రేణుక, శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శులు అనిల్‌రాజ్, ప్రశాంత్ఆచార్య, రుబీనాసుల్తానా, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు ప్రభాకర్, ముత్తయ్య, పృథ్వీరాజ్, నర్సింహారెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు.