భూపాలపల్లి రూరల్, జూన్ 14 : జిల్లాకేంద్రంలో జరిగే వారాంతపు సంతకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని 4, 22, 23 వార్డుల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. నాలుగో వార్డులో నిర్మించే వారాంతపు సంతలో మౌలిక వసతులు కల్పించాలని కమిషనర్ శ్రీనివాస్‌ను ఆదేశించారు. సంతకు వచ్చే రోడ్డు విస్తరణ పనులు అంచనా వేయాలన్నారు. 22వ వార్డులో గ్రామ పంచాయతీ భవనాన్ని కూల్చి కొత్త నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. చిరు వ్యాపారులకు దుకాణా సముదాయ నిర్మాణానికి అంచనా వేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
మిషన్ భగీరథ నీరు రావడంలేదని నాల్గో వార్డులోని కారల్‌మార్క్స్ కాలనీ మహిళలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆయన మూడు రోజుల్లో కాలనీ వాసులకు నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాలు రాలేదని, హక్కు పత్రాలు ఇప్పించాలని రాజీవ్‌నగర్‌లోని మహిళలు కలెక్టర్‌ను వేడుకున్నారు. విద్యుత్ ట్రాన్స్పార్మర్ వల్ల ప్రమాదాలు జరుతున్నాయని వెంటనే దానిని మార్చాలని ప్రజలు కోరగా స్పందించిన కలెక్టర్ వెంటనే స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని విద్యుత్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు ముంజాల రవీందర్ గౌడ్, మేకల రజిత, కన్నం యుగేంధర్, మున్సిపల్ ఏఈ రోజారాణి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రశాంతి, టౌన్ ప్లానింగ్ అధికారి అవినాశ్ పాల్గొన్నారు.