బచ్చన్నపేట, జూన్ 6 : పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య హెచ్చరించారు. మండలంలోని లింగంపల్లి, మన్సాన్పల్లి, సాల్వాపూర్ గ్రామాలను సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం పల్లెప్రగతి పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. లింగంపల్లిలో వైకుంఠధామం వినియోగంలోకి రాకపోవడం, బయో ఫెన్సింగ్ సరిగా లేకపోవడం, చెత్త సేకరణ నిర్వహణలో లోపాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బోరు వినియోగంలోకి తీసుకురావాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈని శివలింగయ్య ఆదేశించారు. వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. తడిపొడి చెత్త పై అవగాహన కల్పించే బాధ్యత సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి ‘మన ఊరు- మనబడి’ పనులను వేగవంతం చేయాలన్నారు. సాల్వాపూర్‌లో పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పనులను పరిశీలించారు. రెండు మూడు రోజుల్లో పల్లెప్రగతి పనులు వందశాతం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్ఈ సత్యనారాయణ, మండల ప్రత్యేకాధికారి వినోద్‌కుమార్, ఎంపీడీవో రఘురామకృష్ణ, సర్పంచ్‌లు మల్లేశం, తార, లక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు పరశురాం, కిరణ్‌కుమార్, వంశీ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరుణ పాల్గొన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు : కలెక్టర్
నర్మెట : పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య హెచ్చరించారు. మండలంలోని మచ్చుపహాడ్ గ్రామాన్ని సోమవారం ఆయన సందర్శించారు. పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు, గ్రామ పంచాయతీ, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాలను పరిశీలించారు. పారిశుధ్య పనులు, రికార్డుల నిర్వహణ సరిగా ఉండాలన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ఐదు ఇనుప స్తంభాలు తొలగించాలని, లూస్ వైర్స్ సరిచేస్తూ అవసరమైన చోట స్తంభాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండలంలోని 17 వైకుంఠధామాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ప్రజలకు అం దుబాటులో ఉండాలని కలెక్టర్ శివలింగయ్య కోరారు. పల్లెప్రగతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు లక్ష్యానికనుగుణంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ దామోదర్, ఎంపీడీవో ఖాజనయీమొద్దీన్, తహసీల్డార్ గంగా భవాని, సర్పంచ్ రామిని శివరాజ్, విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణ పాల్గొన్నారు.