పల్లె, పట్టణ ప్రగతి పనులు ఊరూగా జోరుగా సాగుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా జరిగాయి. ఈ సందర్భంగా వీధులు, మురికికాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు సమస్యలను గుర్తించి పరిష్కార మార్గం చూపారు. ఆయాచోట్ల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
– నమస్తే నెట్వర్క్
నమస్తే నెట్వర్క్ : పల్లె ప్రగతి ఐదో విడుత, పట్టణ ప్రగతి నాలుగో విడుత కార్యక్రమాలు సోమవారం జోరుగా సాగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరిగాయి. పల్లె ప్రగతిలో భాగంగా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి పాఠశాలలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్వయంగా చెత్త ఏరి, బండరాళ్లను తొలగించడంతో పాటు నాయకులతో తీయించారు. మనం పనిచేస్తూ ప్రజలను భాగస్వాములను చేసినప్పుడు ఫలితం ఉంటుందని చెప్పారు.
భూపాలపల్లి మున్సిపాలిటీలోని 17, 22వ వార్డుల్లో డ్రైనేజీల్లో చెత్తను తొలగించడంతో పాటు విద్యుత్ తీగలను తాకుతున్న కొమ్మలను యంత్రంతో కట్ చేయించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని వెల్తూర్లపల్లి, కేశవాపూర్, పాపయ్యపల్లి గ్రామాల్లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య పర్యటించి ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచనలు చేశారు. ఏటూరునాగారం మండలం షాపల్లి, చిన్నబోయినపల్లి, శివ్వాపూర్ గ్రామాల్లో జడ్పీ చైర్మన్ జగదీశ్వర్ పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఫత్తేపురం, మాటేడు గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలను, తొర్రూరు మున్సిపాలిటీ 5వ వార్డు దుబ్బతండాలో కలెక్టర్ శశాంక పర్యటించి నిర్వహణ తీరును పరిశీలించారు. హనుమకొండలో హౌసింగ్బోర్టుకాలనీ, నక్కలగుట్ట, సర్క్యూట్ గెస్ట్‌హౌస్ రోడ్డులో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పర్యటించి చెత్త తొలగింపు పనులు పరిశీలించి సూచనలు చేశారు.
ఎల్కతుర్తి మండలం కోతులనడుమ, శాంతినగర్‌లో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడా మైదానాలను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పరిశీంచి చెట్లు ఎండిపోకుండా నీళ్లు పట్టాలని సూచించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి, మన్సాన్పల్లి, సాల్వాపూర్ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను కలెక్టర్ శివలింగయ్య ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణపై అసంతృప్తి వ్యక్తంచేశారు. రెండు మూడు రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేట, వెంకటాపురం, తోపనపల్లి, అలంకానిపేట గ్రామాల్లో సాగుతున్న పల్లె ప్రగతి పనులను కలెక్టర్ గోపి పరిశీలించారు. గీసుగొండ మండలం ఎలుకుర్తిలో పల్లె ప్రకృతి వనం, క్రీడాప్రాంగణం, వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు.