న్యూశాయంపేట, జూన్ 6 : ప్రస్తుతం ఏ రంగంలో రాణించాలన్న ఇంగ్లిష్ వచ్చి ఉండాలని, ఇంగ్లిష్ యూనివర్సల్ భాష అని వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. హంటర్‌రోడ్డులోని కోడెం కన్వెన్షన్ హాల్లో అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్, మేధా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈజీ ఇంగ్లిష్ ఉచిత శిక్షణ తరగతులను యండమూరి వీరేంద్రనాథ్, చైతన్య యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జీ దామోదర్, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ.. సబ్జెక్టులో బేసిక్స్ ముఖ్యమని, కష్టంతో కాదు ఇష్టం, నిబద్ధతతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. యువత ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అవకాశాలను పొందడానికి ఇంగ్లిష్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఠాగూర్ సినిమాలోని ఏసీఎఫ్ మాదిరిగా ఏజీఎఫ్ (అరూరి గట్టుమల్లు ఫౌండేషన్) తయారు కావాలని, సమాజంలో ఏజీఫ్కి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం యండమూరి వీరేంద్రనాథ్‌ను ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్ ఘనంగా సన్మానించారు. మేధా చిరంజీవి, విన్నర్స్ అకాడమీ డైరెక్టర్ రాజిరెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
