వర్ధన్నపేట, జూన్ 6: నూనెగింజల పంట సాగుతో రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని జేడీఏ ఉషాదయాళ్ అన్నారు. నూనెగింజల పంట సాగుపై ఢిల్లీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు దమ్మన్నపేటకు చెందిన రైతు పచ్చిక చెన్నకృష్ణారెడ్డి అనుభవాలను సోమవారం వీడియోలో చిత్రీకరించారు. వరి పంట సాగుతో రైతులకు నష్టం కలుగుతున్నందున రైతులు విధిగా నూనెగింజల పంట సాగు చేస్తే ఆర్థికంగా నిలదొక్కుకుంటారనే విషయమై ప్రతినిధులు ప్రత్యేకంగా డాక్యుమెంటరీ తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా గత యాసంగిలో వరికి బదులు నువ్వుల పంటను సాగు చేసిన కృష్ణారెడ్డిని పంట క్షేత్రంలో కలిశారు. ఈ సందర్భంగా పంటసాగు చేసిన విధానం, రైతుకు వచ్చిన ఆదాయంపై ఆయన మాటల్లోనే చిత్రీకరించారు.
డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి
దేశవ్యాప్తంగా కూడా వరి పంటకు బదులు ప్రజల అవసరం, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు సాగు చేస్తే రైతులు, దేశానికి మేలు కలుగుతుందని జేడీఏ వివరించారు. సరుకుల ధరల పెరుగుల కూడా రైతులు పండించే పంటలపైనే ఆధారపడి ఉన్నందున నిపుణుల సూచనల మేరకు పంటలను సాగు చేసుకోవాలని అన్నారు. ప్రధానంగా నూనెగింజల పంట సాగు చేస్తే రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందన్నారు. యాసంగిలో కృష్ణారెడ్డి నువ్వుల పంటను సాగు చేయడం వల్ల ఎకరానికి రూ. 38 వేల వరకు నికర ఆదాయాన్ని పొందినట్లు వివరించారు. ఒకే రకమైన పంటను ఏటా పండించడం వల్ల భూమి కూడా నిస్సారంగా తయారై దిగుబడి తగ్గి రైతులు నష్టపోతారని వివరించారు. రైతులు నూనెగింజల పంట సాగుతోపాటు పంటల మార్పు చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను డాక్యుమెంటరీ రూపంలో దేశవ్యాప్తంగా రైతులకు వివరించడం కోసం నేషనల్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు డాక్యుమెంటరీ చేస్తున్నట్లు వెల్లడించారు. వారికి జిల్లా వ్యవసాయ శాఖ సహకారం అందిస్తామని జేడీఏ చెప్పారు. కార్యక్రమంలో ఏవో రాంనర్సయ్య, ఎన్ఎఫ్ఎం కన్సల్టెంట్ సారంగం, రైతులు పాల్గొన్నారు.