వరంగల్, జూన్ 6(నమస్తేతెలంగాణ) : ప్రస్తుతం డెలివరీల్లో ఎక్కువశాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. సాధారణ ప్రసవాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల కొందరు వైద్యులు సిజేరియన్లు చేస్తున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో ఎక్కువగా డబ్బుల కోసం సిజేరియన్లు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రజలపై ఆర్థికభారం పడడంతో పాటు తల్లీబిడ్డల ఆరోగ్యానికీ హాని కలుగుతున్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పలు రకాల నష్టాలు కలిగిస్తున్న సిజేరియన్లను తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవల డీఎంహెచ్‌వో వెంకటరమణ ప్రసవాలకు ముహూర్తాలపై జిల్లాలోని పురోహితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముహూర్తాలు పెట్టడం అనైతికమన్నారు. ముహూర్తాల ప్రసవాలతో కలిగే నష్టాలను గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు వివరించాలని కోరారు.
ప్రసవాలకు ముహూర్తాలు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సానుకూలంగా స్పందించిన పురోహితులు ఇకనుంచి ప్రసవాలకు ముహూర్తాలు పెట్టమని ప్రకటించారు. పురోహితుల ప్రతినిధి గంగు ఉపేంద్రశర్మ ఈ మేరకు పురోహితులందరికీ సమాచారం పంపారు. శనివారం కలెక్టర్ బీ గోపి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలపై సమావేశం నిర్వహించారు. వరంగల్‌లోని సీకేఎం, ఎంజీఎం హాస్పిటల్, నర్సంపేట, వర్ధన్నపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది సమావేశానికి హాజరయ్యారు. దవాఖానల్లో సాధారణ ప్రసవాలు తక్కువగా, సిజేరియన్లు ఎక్కువగా జరుగుతుండడంపై చర్చించారు. గైనకాలజిస్టులు ప్రజెంటేషన్ ద్వారా కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు సాధారణ ప్రసవం వల్ల కలిగే లాభాలు, సిజేరియన్తో జరిగే నష్టాలపై కౌన్సెలింగ్ ఇవ్వాలని కలెక్టర్ వైద్యులు, సిబ్బందికి చెప్పారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణులకు అవసరమైన పరికరాలు, మందులను సమకూర్చాలని ఆదేశించారు.
నిబంధనలు మీరితే మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు..
ప్రభుత్వ చర్యలతో దవాఖానల్లో సిజేరియన్లు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో ప్రభుత్వ దవాఖానల్లో సిజేరియన్ల శాతం 58 ఉండగా మే నెలలో 54కు తగ్గింది. ప్రైవేట్ దవాఖానల్లో ఇది గత నెలలో 90 నుంచి 88 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వానికి తాజాగా పంపిన నివేదికలో తెలిపారు. ఈ నెలలో ప్రభుత్వ దవాఖానల్లో సిజేరియన్ల శాతం మరింత తగ్గే అవకాశం ఉంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 60 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో ఇవి తగ్గాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రైవేట్ దవాఖానల్లో అనవసర సిజేరియన్లు జరుగకుండా చూడాలని, నిబంధనలను మీరితే మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. సాధారణ ప్రసవాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వ డాక్టర్లు, నర్సులకు ఇన్సెంటివ్స్ ఇస్తామని మంత్రి చెప్పారు. హరీశ్‌రావు ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అనవసర సిజేరియన్లు జరిగే ప్రైవేట్ దవాఖానల సమాచారం సేకరిస్తున్నారు. ఒకటి, రెండుసార్లు నోటీసులు జారీ చేసి అవసరమైతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించేందుకు సమాయత్తమవుతున్నారు.

అనవసరంగా సిజేరియన్లు చేస్తే చర్యలు
– వెంకటరమణ, డీఎంహెచ్‌వో
అనవసర సిజేరియన్లపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సిజేరియన్లు తగ్గాలని చెపుతున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటికే సిజేరియన్లు రోజురోజుకూ తగ్గుతున్నాయి. అదే స్థాయిలో ప్రైవేట్ దవాఖానల్లోనూ తగ్గాల్సి ఉంది. సిజేరియన్లు చేసే ప్రైవే ట్ దవాఖానలపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటి లైసెన్సు రద్దు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. సాధారణ ప్రసవాల పెంపునకు ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తున్నం. ముఖ్యంగా రక్తహీనత ఉన్న గర్భిణులు సరైన పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. ప్రతి నెలా నాలుగు చెకప్‌లు తప్పనిసరి. గైనకాలజిస్టుల సలహాలతో ఎక్సర్సైజ్ చేస్తే కూడా మంచిది. ఆన్లైన్లో తమ పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచి గర్భిణులకు అవసరమైన సలహాలు, సూచనలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.