వరంగల్, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజలకు అన్ని రకాలుగా రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా ఉండే పోలీసు శాఖలోని అధికారులపై గట్టి నిఘా పెడుతున్నది. ఫిర్యాదుదారులకు న్యాయం అందించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ విధానానికి విరుద్ధంగా వ్యవహరించే పోలీసు అధికారులపై కఠినంగా వ్యవహరిస్తున్నది. అక్రమార్కులకు అండగా ఉండడం, నిషేధిత వస్తువులు విక్రయించే వ్యాపారులకు సహకరించడం, భూ వివాదాల్లో సొంత న్యాయం అమలు చేసేందుకు బాధితులను ఇబ్బంది పెట్టడం వంటి పనులు చేస్తున్న పోలీసు ఇన్స్పెక్టర్లపై వరుసగా వేటు వేస్తున్నది. వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో అక్రమాలు, అవినీతి ఆరోపణలు వచ్చిన ఇన్స్పెక్టర్లపై పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి వేగంగా విచారణ జరుపుతున్నారు.
విచారణ నివేదికల ఆధారంగా సస్పెండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా తప్పుడు పోలీసు అధికారులపై వేటు వేస్తుండడంతో ప్రజలు హర్షిస్తున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్‌లోని పలువురు ఇన్స్పెక్టర్లపై ఇటీవల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. భూఆక్రమణదారులకు సహకరించడం, బాధితులను ఇబ్బంది పెట్టడం, కస్టమర్లకు డబ్బులు ఇవ్వని చిట్‌ఫండ్ వ్యాపారులకు సహకరించడం.. గుట్కా, పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారుల నుంచి మామూళ్లు వసూలు చేయడం వంటివి వీటిలో ఉంటున్నాయి. పోలీసు శాఖ పారదర్శకంగా ఉండేందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు కమిషనర్ ఈ అంశాల్లో చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు కమిషనరేట్‌లో ఇటీవల ఇలాంటివి వెలుగులోకి వస్తున్నాయి.
కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ లైంగిక దాడి కేసు వెలుగుచూసింది. ఈ ఘటనలో అనుమానితులు నలుగురు ఉంటే ఒక్కరిపైనే కేసు నమోదు చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. మిగిలిన ముగ్గురు నిందితులను కేసు నుంచి తప్పించేందుకు ఇన్స్పెక్టర్ పీ మహేందర్‌రెడ్డి వారి వద్ద నుంచి పైసలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదైన మరుసటి రోజు పోలీసులు పేర్కొన్న నిందితుడితోపాటు మరో ముగ్గురు ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత సీఐ మరో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంతోపాటు ఇసుక ట్రాక్టర్ల ఓనర్ల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకున్నారనే ఆరోపణలపైనా పోలీసు అధికారులు విచారణ జరిపారు. కొన్ని కేసులతో రెండు వర్గాల నుంచి పైసలు తీసుకోవడం, మరికొన్ని కేసులతో వాస్తవ అంశాలకు విరుద్ధంగా విచారణ చేపట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అన్ని ఆరోపణల ఆధారంగా విచారణ నిర్వహించి ఇటీవలే సస్పెండ్ చేశారు.
మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్గా పని చేసిన రవికిరణ్‌పై అవినీతి, ఆరోపణలు వచ్చాయి. భూ ఆక్రమణదారులకు సహకరించడంపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి. నెలవారీగా మామూళ్లు తీసుకుంటూ గుట్కా వ్యాపారులు, సబ్సిడీ బియ్యం అక్రమార్కులకు సహకరించారని ఆరోపణలు వచ్చాయి. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో సెటిల్మెంట్ చేసుకుని కేసు నమోదు చేయకుండా సొంత న్యాయం చేసిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. పోలీస్ కమిషనర్‌గా ప్రమోద్‌కుమార్ ఉన్నప్పుడు విచారణ మొదలైంది. తరుణ్‌జోషి బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయి విచారణ నిర్వహించి ఆరోపణలు వాస్తవాలని తేలడంతో రవికిరణ్‌ను సస్పెండ్ చేశారు.
హనుమకొండ ఇన్స్పెక్టర్గా పీ దయాకర్ పనిచేస్తూ భూ వివాదంలో సొంత న్యాయం చేసిన ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. ఈ స్టేషన్ పరిధిలో భూ ఆక్రమణ కేసు విషయంలో ఇన్స్పెక్టర్ పీ దయాకర్ భాదితుడిని బెదిరించారు. తనతో బలవంతంగా సంతకం చేయించారని బాధితుడు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని అంశాలపై విచారణ జరిపిన అనంతరం అప్పుడు సీపీగా ఉన్న ప్రమోద్‌కుమార్ వెంటనే చర్యలు తీసుకున్నారు. సస్పెండ్ చేయడంతోపాటు అదే స్టేషన్లో కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో కీలకమైన సుబేదారి ఇన్స్పెక్టర్గా పనిచేసిన సీహెచ్ అజయ్ భూ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, ఇదే అంశాల్లో కేసు నమోదు చేయకుండా జాప్యం చేయడం, నిందితుడి సహకరించడం వంటి ఆరోపణలు వచ్చాయి. మరో భూ తగాదాలో కేసు నమోదు చేయకుండా రెండు వర్గాల నుంచి డబ్బులు తీసుకుని రాజీ కుదర్చిన అంశంపై పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు అందింది. అన్ని ఆరోపణలపై విచారణ అనంతరం అజయ్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ పోలీసు కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు.
కేయూసీ ఇన్స్పెక్టర్గా గతంలో పని చేసిన ఎస్వీ రాఘవేందర్రావు గోపాల్‌పూర్‌లో ఓ భూ వివాదంలో బాధితుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బెదిరించారు. ఇన్స్పెక్టర్తోపాటు ఎస్సై విఠల్ కలిసి బాధితుడినే భయపెట్టి ఇబ్బందులకు గురి చేశారు. అకమార్కులకు మద్దతు తెలిపి తనను ఇబ్బందులకు గురి చేశారని బాధితుడు డీజీపీకి ఫిర్యాదు చేశాడు. స్వయంగా పోలీస్ కమిషనర్ విచారణ చేపట్టి ఇన్స్పెక్టర్, ఎస్సైపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చారు. ఇద్దరిపై ఒకేసారి సస్పెన్షన్ వేటు చేశారు.
ధర్మసాగర్ ఇన్స్పెక్టర్గా పని చేసిన ఎండీ షాదుల్లాబాబా అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించి భారీగా గుట్కా ప్యాకెట్లను పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. కొద్ది రోజుల తర్వాత ఈ గుట్కా ప్యాకెట్లు అక్కడ లేకుండా పోయాయి. ఇన్స్పెక్టర్ పరిధిలో ఉండాల్సిన సీజ్ చేసిన గుట్కా ప్యాకెట్లు మళ్లీ వ్యాపారుల వద్దకు చేరినట్లు విచారణలో తేలింది. ఈ అంశంతోపాటు భూ ఆక్రమణదారులకు సహకరించడం, బెల్ట్ షాపుల నుంచి మామూళ్ల వసూలు ఆరోపణలతో ఈయనను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.