‘ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు.. టీఆర్ఎస్ సర్కారు రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నది. వరంగల్ మహా నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కోసం జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) నోటిఫికేషన్‌ను రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది..’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, టీ రాజయ్య, మేయర్ సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్, కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, బీ గోపి, కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్‌లో ల్యాండ్ పూలింగ్ విధానం ఉండబోదని స్పష్టం చేశారు.
– వరంగల్, మే 31
వరంగల్, మే 31 : రైతుల అభిప్రాయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌ను వెన క్కి తీసుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. భూ సమీకరణ ప్రక్రియ రద్దుపై కుడా కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరం చుట్టూ రింగ్‌రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని నెల క్రితం నోటిఫికేషన్ జారీ చేశామని, మెజారిటీ రైతులు ఈ ప్రక్రియను వ్యతిరేకించడంతో ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. 15 రోజుల క్రితమే రద్దు చేయాలని నిర్ణయించినా మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండడంతో కాస్త ఆలస్యమైందని వివరించారు. రైతుల అభిప్రాయాలను ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన నోటిఫికేషన్ రద్దుకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా పబ్బం గడుపుకొనే పార్టీలు, ల్యాండ్ మాఫియా కలిసి రైతులను ఆగం చేస్తున్నాయని, మాయమాటలను రైతులు నమ్మవద్దని కోరారు. అభివృద్ధి అనేది ఎక్కడా అగదని, ల్యాండ్ అక్వేషన్ ప్రక్రియ ద్వారా భూ సేకరణ చేసి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. కుడా ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి పను లు చేసినా రైతులకు నష్టం జరుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ సీఎం కేసీఆర్ వద్ద ఉందని, త్వరలోనే ఆయన సమగ్రంగా సమీక్షించి అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు.
ఆగం చేసేందుకే కుట్రలు : ఎమ్మెల్యే అరూరి
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు ల్యాండ్ మాఫియాతో కలిసి రైతులను ఆగం చేస్తున్నాయని విమర్శించారు. రైతుల అభిప్రాయాల మేరకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దు చేయడంతో కొన్ని పార్టీలకు, ల్యాండ్ మాఫియాకు మింగుడు పడడం లేదన్నారు. రైతులను ఆగం చేసేందుకే కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కడుపు నింపే ప్రభుత్వమని స్పష్టం చేశారు. 28 గ్రామాల్లోని సర్వే నంబర్లతో ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను పూర్తిగా ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు మాట్లాడుతూ భవిష్యత్‌లో ల్యాండ్ పూలింగ్ చేపట్టబోమని చెప్పారు. కుడా వైస్ చైర్పర్సన్ ప్రావీణ్య మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసిందని స్పష్టం చేశారు.

మంత్రి ఎర్రబెల్లికి సన్మానం
ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దు చేయడంతో రైతులు సంబురాలు చేసుకున్నారు. కుడా కార్యాలయానికి వచ్చిన పైడిపల్లి, ఆరెపల్లి, కొత్తపేట గ్రామాల రైతులు సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను శాలువాలతో సన్మానించారు. భూ సమీకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ప్రభుత్వానికి, ఇందుకు కృషి చేసిన మంత్రి దయాకర్‌రావుకు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.