నర్సంపేట, మే 31: పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. నాలుగో విడుత పట్టణప్రగతిపై నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. పట్టణప్రగతిలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలను పక్కాగా చేపట్టాలన్నారు. పట్టణంలో నిర్మించిన ఆరు పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను సక్రమంగా చేయాలన్నారు. గత పట్టణప్రగతిలో భాగంగా ఇంటింటా చెత్త సేకరణకు ఆరు స్వచ్ఛ ఆటోలు, రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేశామని వెల్లడించారు. వైకుంఠరథం కొనుగోలు చేసి అందుబాటులోకి తేవాలన్నారు. నర్సంపేటలోని అన్ని వార్డులో మూడో విద్యుత్ వైర్ వేయించేందుకు రూ. 50.18 లక్షలను ఖర్చు చేశామని తెలిపారు. ద్వారకపేట శ్మశాన వాటిక స్థలంలో రూ. కోటి టీయూఎఫ్ఐడీసీ నిధులతో వైకుంఠధామం నిర్మాణం పూర్తి చేయించామని వివరించారు. హరితహారంలో భాగంగా పట్టణంలో మూడు నర్సరీలను ఏర్పాటు చేసి 2.60 లక్షల మొక్కలు పెంచామని చెప్పారు. వచ్చే హరితహారంలో పట్టణంలో నాటేందుకు 1,47,550 మొక్కలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ప్రస్తుతం నాలుగో విడుత పట్టణప్రగతిలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని ఆదేశించారు.
ఇంటింటికీ ఆరు మొక్కలు
వచ్చే హరితహారంలో ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయాలని అధికారులను కోరారు. ప్రజల చేతుల మీదుగా మొక్కలు నాటించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు పడగానే ఈ పనులను పూర్తి చేయించాలన్నారు. వర్షాకాలంలో ప్రజలు వ్యాధులకు దూరంగా ఉండేలా చూడాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలెవరూ చెత్తను పరిసరాల్లో వేయకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి వార్డు, ప్రభుత్వ, మున్సిపాలిటీ స్థలాల్లో మొక్కలు పెంచి వనాలను తయారు చేయాలని కోరారు. గుంతల్లో వర్షపు నీరు నిల్వకుండా చూసుకోవాలని తెలిపారు. సమీక్షలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాయిని వెంకటస్వామి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.