వరంగల్, మే 31: గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన తెలంగాణ క్రీడా ప్రాంగణాల పనుల్లో వేగం పెంచి త్వరతగతిన పూర్తి చేయాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో క్రీడాప్రాంగణాల పనుల పురోగతిపై మంగళవారం ఆమె హార్టికల్చర్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో మొదటి విడుతలో 22 క్రీడా ప్రాంగణాలను ఈ నెల 2 ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి క్రీడా ప్రాంగణంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్‌జంప్, వ్యాయామ బార్లు, వాకింగ్ ట్రాక్‌లు తప్పనిసరిగా ఉండాలని, ప్రహరీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్రీడా ప్రాంగణాల్లో మొక్కలు నాటాలన్నారు. ప్రస్తుతం ఎల్లాపూర్, క్రిస్టియన్కాలనీలతోపాటు 8 నర్సరీల్లో ఆర్చి గేట్లు, మొక్కల వివరాల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. గ్రేటర్లో మరో 20 నర్సరీలను జూన్ 6 నాటికి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
నిర్వహణలో ఉన్న 11 పట్టణప్రకృతి వనాలు, కొత్తగా ఏర్పాటు చేయనున్న 36 పట్టణప్రకృతి వనాల్లో బెంచీలు, ఆర్చి గేట్లు ఏర్పాటు చేయాలన్నారు. నత్తనడకగా నడుస్తున్న చోట ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. జూన్ 3న ప్రారంభం కానున్న పట్టణప్రగతి కార్యక్రమంపై కార్పొరేటర్లతో చర్చించాలని అధికారులకు సూచించారు. జూన్ 5 నాటికి నాలాల పూడికతీత పనులు, బీటీ, సీసీరోడ్లపై గుంతల పూడ్చివేతలు పూర్తిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, ఎస్ఈ సత్యనారాయణ, సిటీ ప్లానర్ వెంకన్న, డీఎఫ్‌వో కిశోర్, కార్యదర్శి విజయలక్ష్మి, ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.
శేష జీవితాన్ని సంతోషంగా గడపాలి
ఉద్యోగ విరమణ అనంతరం శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య అన్నారు. బల్దియా జేఏసీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ఉద్యోగ విరమణ పొందిన సిబ్బంది సోల లింగయ్య, చిలువేరు కట్టయ్యను సన్మానించారు. 41 ఏళ్లు కార్పొరేషన్ ఉద్యోగులుగా విశేష సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, డీఈ నరేందర్, ఏఈ హబీబుద్దీన్, సతీశ్, జేఏసీ అధ్యక్షుడు గౌరీశంకర్, సభ్యులు బాకం సంతోష్, రాజారపు భాస్కర్, బొట్ల రమేశ్, మోరె రమేశ్, బుర్ర మహేశ్, నవీన్, సురేష్ పాల్గొన్నారు.
ప్రణాకాబద్ధంగా నిర్వహించాలి
ఈ నెల 3న చేపట్టనున్న నాలుగో విడుత పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సీడీఎంఏ సత్యనారాయణ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్లను దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణప్రగతి లక్ష్యాలు సాధించాలన్నారు. క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు, సమీకృత మార్కెట్లు, నర్సరీల ఏర్పాటు జరుగాలని ఆదేశించారు. గ్రేటర్లో రూ. 1.25 కోట్లతో 22 క్రీడా ప్రాంగణాలు పూర్తి చేసి జూన్ 2న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రావీణ్య తెలిపారు. ప్రస్తుతం ఉన్న 8 నర్సరీలను బలోపేతం చేస్తూ మరో 20 కొత్తవి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్వహణలో ఉన్న 11 పట్టణప్రకృతి వనాలతోపాటు కొత్తగా మరో 36 ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, డిప్యూటీ కమిషనర్ జోనా, సిటీ ప్లానర్ వెంకన్న పాల్గొన్నారు.