నర్సంపేట రూరల్, మే 31: ప్రభుత్వ భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించేందుకు ప్రయత్నించగా మంగళవారం సాయంత్రం రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అంతేకాకుండా అధికారులు ప్రభుత్వ భూమిలో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాజుపేట గ్రామ శివా రు పెరుమాండ్లకుంట (పీతిరికుంట)లో ఉన్న సర్వేనంబర్ 8లో 25 ఎకరాలు, సర్వేనంబర్ 184లో 9 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇం దులో కొంత స్థలం నర్సంపేట-నల్లబెల్లి ప్రధాన రహదారికి ఇరువైపులా ఉంది. దీంతో ఈ భూ మికి మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. ఇది లా ఉండగా కొందరు రియల్ఎస్టేట్ వ్యాపారులు, ఓ ప్రజాప్రతినిధి పెరుమాండ్లకుంటకు సంబంధించిన చెరువు శిఖం భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. సర్వే నంబర్ 8లో 1 ఎకరం, సర్వే నంబర్ 184లో 2ఎకరాలను రియల్ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి ప్లాట్లకోసం జేసీబీతో చదును చేయించారు.
ఇక్కడ ఎకరానికి ధర రూ.1 కోటి పలుకుతోంది. అంటే ఈలెక్కన చూసినట్లయితే రూ.3 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో గ్రామస్తులు స్థానిక రెవెన్యూ అధికారుల సాయంతో తహసీల్దార్ వాసం రామ్మూర్తికి ఫిర్యాదు చేశారు. ఈమేరకు తహసీల్దార్ రామ్మూ ర్తి ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం రాజుపేట వీఆర్వో మండల కోమల, సర్వేయర్ దశరథం, వీఆర్ఏ నూనె ఉపేందర్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆక్రమణదారులు చదును చేసిన స్థలం, చెరువును పరిశీలించారు. చివరకు పెరుమాండ్లకుంట చెరువు శిఖం ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అక్కడే సంబంధిత రికార్డులను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. చివరకు రెవెన్యూ అధికారులు హెచ్చరికతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
మా దృష్టికి వచ్చింది
రాజుపేట శివారులోని చెరువు శిఖంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం స్థానికుల ద్వారా మా దృష్టికి వచ్చింది. వెంటనే సంబంధిత రెవెన్యూ అధికారులను సంఘటన స్థలానికి పంపించాం. వారు ప్రభుత్వ భూమిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకుంటాం. ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోం. రాజుపేట ఏజెన్సీ గ్రామంలోని సర్వే నంబర్ 8, సర్వే నంబర్ 184లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాటి అమ్మకాలు, కొనుగోళ్లు నిషేధం. ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– వాసం రామ్మూర్తి, తహసీల్దార్, నర్సంపేట