ఖిలావరంగల్, మే 26 : చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని వరంగల్ తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం ఖిలావరంగల్‌లోని ఖుష్‌మహల్ ప్రాంగణాన్ని కలెక్టర్ బీ గోపి, ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త జిల్లాలో జరుగుతున్న వేడుకలను కాకతీయుల ఖ్యాతి ఉట్టిపడేలా నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేందర్‌జీ, తహసీల్దార్ ఫణికుమార్, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్, శంభునిగుడి చైర్మన్ గజ్జెల శ్యాం, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు భోగి సురేశ్, గుస్తాల సంఘం అధ్యక్షుడు ఇనుమల మల్లేశం, టీఆర్ఎస్ నాయకులు సయ్యద్ మసూద్, నలిగంటి నవీన్, కాసుల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష..
ఖిలావరంగల్ ఖుష్‌మహల్ ప్రాంగణంలో నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లు ఘనంగా ఉండాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. గురువారం వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకలు జరిగే ప్రాంతాన్ని జీడబ్ల్యూఎంసీ సిబ్బంది శుభ్రం చేయాలన్నారు. పడమర కోటలోని అమర వీరుల స్తూపాన్ని పూలతో అలంకరించాలన్నారు. వేదిక మీద వీఐపీలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో మహేదర్ను ఆదేశించారు. గౌరవ వందనం, పరేడ్ పనులు, బారికేడింగ్, ట్రాఫిక్ కంట్రోల్ బాధ్యత పోలీస్ శాఖ చూసుకోవాలని సూచించారు. అలాగే ముఖ్య అతిథుల సందేశం, కవి సమ్మేళన ఏర్పాట్లు, వేదిక వద్ద సౌండ్ సిస్టిం, సాంస్కృతిక కళా ప్రదర్శనలను డీపీఆర్వో బండి పల్లవి చూసుకోవాలని చెప్పారు. వైద్య బృందం, విద్యుత్ శాఖ అందుబాటులో ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పని చేసి వేడుకలను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బీ హరిసింగ్, శ్రీవత్స కోట తదితరులు పాల్గొన్నారు.
