హనుమకొండ, మే 26 : దళితుల ఆర్థిక అభ్యున్నతే సర్కారు ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని దళిత బంధు పథకం లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభు త్వం దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. దేశంలో ఎకడా లేని విధంగా అద్భుతమైన అభివృద్ధి తెలంగాణలో జరుగుతున్నదన్నారు. దళిత బంధు లబ్ధిదారులు లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక శిక్షణ ఇచ్చి లబ్ధిదారులకు తగిన యూనిట్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులనే ఎంపిక చేశామని చెప్పారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి మొత్తం 18 రకాల యూనిట్లను 100 మందికి ఎంపిక చేశామని, ఇందులో 87 మంది ఖాతాల్లో ఇప్పటికే డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆలోచనల మేరకు దళితబంధు లబ్ధిదారుల్లో ఉన్నత విద్యావంతులు ప్రత్యేకంగా ఉమ్మడి వ్యాపారం చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మే నెలలో కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. కార్మికులు చేసిన పనులు వారి పిల్లలు చేయకూడదనే మంచి సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

అనుభవం ఉన్న రంగంలో యూనిట్లు ఎంపిక చేసుకోవాలి : కలెక్టర్
దళితబంధు పథకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. రూ.10 లక్షల విలువైన యూనిట్లు తీసుకోవచ్చని, యూనిట్ విలువ అంతకంటే ఎకువ ఉంటే గ్రూపుగా ఏర్పడి కొనుగోలు చేయొచ్చని తెలిపారు. లబ్ధిదారులు అనుభవం ఉన్న రంగంలో యూనిట్ ఎంపిక చేసుకోవాలని కోరారు. మినీ డెయిరీ, పౌల్ట్రీ ఫామ్, సూపర్ మారెట్లు, కూరగాయల వ్యాపారం, రవాణా గూడ్స్ వాహనాలు, ఎక్స్కవేటర్లు, డ్రిప్, పేపర్ ప్లేట్స్ ఇలా వివిధ రకాల వ్యాపారాలు ఎంచుకోవచ్చన్నారు. ఏదైనా సమాచారం, సందేహాలు ఉంటే దళితబంధు సెక్టోరియల్ అధికారులు, సిబ్బందిని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
సమ్మయ్య ఉద్వేగం..
అవగాహన సదస్సుకు హాజరైన దళితబంధు లబ్ధిదారుడు పత్రి సమ్మయ్య ఉద్వేగానికి లోనయ్యాడు. ‘స్థానిక ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ చొరవతోనే మమ్ములను ఈ పథకానికి ఎంపిక చేశారు. మేము వాజ్‌పేయ్ కాలనీలో ఉంటున్నాం. మా నాన్న చంద్రయ్య, తల్లి పార్వతమ్మ ఇనుప సామాన్లు, కాగితాలు ఏరుకొనే బేరం చేస్తూ నన్ను, అక్క లక్ష్మిని చదివించారు. నేను ఇప్పుడు బీఈడీ చేస్తున్న.. అక్క ఎంటెక్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నది. మా అమ్మనాన్నలు ఎంతో కష్టపడి చదివించారు. మా పరిస్థితిని తెలుసుకున్న వినయ్‌భాస్కర్ సారు దళిత బంధు పథకానికి ఎంపిక చేశారు. బొలెరో వాహనం కొనుకున్నాం. వినయ్ సార్‌కు ఎంతో రుణపడి ఉంటాం.’ అని కన్నీటి పర్యంతమయ్యాడు.