వరంగల్ చౌరస్తా, మే 26 : రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలైన క్షతగాత్రుల ప్రాణాలు కాపాడడంలో పైలట్స్ (అంబులెన్స్ డ్రైవర్) పాత్ర కీలకమైనదని వరంగల్ జిల్లా 108, 102 వాహన సేవల కోఆర్డినేటర్ రాము అన్నారు. గురువారం వరంగల్ ఆయుర్వేద దవాఖాన ఆవరణలో నిర్వహించిన పైలట్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రమాద సమాచారం అందిన వెంటనే స్పందించి తక్కువ సమయంలో సమర్థవంతంగా క్షతగాత్రులకు ఇబ్బందులు కలుగకుండా దవాఖానకు సరైన సమయంలో చేర్చడంతోనే ప్రాణాలను నిలిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఎక్కడో వైద్య సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలకు సైతం వెళ్లి గాయాలపాలైన వారి ప్రాణాలను కాపాడడానికి వారి ప్రాణాలను పణంగా పెట్టి వాహణాన్ని వేగంగా హాస్పటల్స్‌కి తరలించడానికి వారు తీసుకునే ఒత్తిడి అసాధారణంగా ఉంటుందన్నారు. క్షతగాత్రుడి ప్రాణాలను కాపాడడానికి వారు తీసుకుంటున్న ఒత్తిడి భరించి సేవలు అందిస్తున్న పైలట్స్ సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పరిధిలో సేవలు అందిస్తున్న 108 వాహణాల పైల్సట్స్ సదానందం, సాంబయ్య, అశోక్‌రెడ్డి, సృజన్, శ్రీను, టెక్నిషియన్లు, ఈఎంటీలు,102 వాహణాల పైలట్స్ రఘుపతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
108 పైలట్లను సన్మానించిన శ్రీరామలింగేశ్వర ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు
గిర్మాజీపేట, మే 26 : పైలట్స్ డేను పురస్కరించుకుని గురువారం పట్టణంలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు 108 వాహనాల పైలట్లను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ అప్పరాజు రాజు మాట్లాడుతూ లక్షల మంది ప్రాణాలను కాపాడుతూ ధనిక, పేద ప్రజల ప్రాణాలకు భరోసానిస్తూ ప్రమాదాలు జరిగినపుడు క్షణాల్లో ప్రత్యక్షమై అక్కడిక్కడే ప్రథమచికిత్స అందిస్తూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అతివేగంగా దవాఖానలకు తరలిస్తున్న 108 వాహన పైలెట్ల అందరికీ కృతజ్ఞతలన్నారు. తూర్పు నియోజకవర్గ 108 పైలెట్స్‌గా సేవలు అందిస్తున్న దాసరి సదానందం, డీ సాంబయ్య, అశోక్‌రెడ్డిలను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదేశాలతో గురువారం వారిని దేవాలయానికి ఆహ్వానించి ట్రస్ట్ బోర్డు సభ్యులు సన్మానించారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు చిట్టిమళ్ల సురేశ్, గంగిశెట్టి హరినాథ్, కటకం రాములు, ప్రసాద్, ఎడ్ల అన్వేశ్, ఎడ్ల నవనీత్ పాల్గొన్నారు.