పల్లె ప్రకృతి వనాలు.. పచ్చని చెట్లతో ప్రజలకు ఆహ్లాదం, ఆనందం పంచడంతో పాటు ఫొటోషూట్లకూ వేదికలవుతున్నాయి. లోపలికి అడుగుపెట్టగానే కట్టిపడేసే వాతావరణం, ఆకట్టుకునే తీరొక్క పూలు, అలంకరణ మొక్కలు, రాళ్లపై వేసిన రంగురంగుల చిత్రాలు.. ప్రీ వెడ్డింగ్ షూట్‌కు అనువుగా ఉన్నాయి. అందుకే ఒక్కటయ్యే కొత్తజంటలు ఈ అందమైన పల్లె పార్కుల్లో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. లొకేషన్ కూడా బాగుండడం, ఫొటోలు క్లారిటీగా వస్తుండడంతో పాటు ఉచితం కావడంతో ఫొటోగ్రాఫర్లను సైతం క్యూకట్టేలా చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ ద్వారా పార్కులను ప్రత్యేకంగా తీర్చిదిద్దడంతో కొత్తందం సంతరించుకొని ఇలా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
నర్సింహులపేట, మే 21 : రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’లో భాగంగా తీర్చిదిద్దిన పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు కొత్తశోభ తీసుకొచ్చాయి. పట్టణంలోని పార్కులకు ఏమాత్రం తీసిపోకుండా రకరకాల మొక్కలు, పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు, రాక్‌గార్డెన్ తలపించేలా రాళ్లపై బొమ్మలు, వాకింగ్ ట్రాక్, మధ్యలో ఒక విగ్రహం ఏర్పాటుచేయడంతో ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్నాయి. ఉదయం, సాయం త్రం పిల్లలతో కలసి సరదాగా గడిపేందుకు అనువుగా మారా యి. ఇప్పుడవే ప్రకృతి వనాల్లో ఫొటోషూట్లకూ కేరాఫ్‌గా మారుతున్నాయి. కేవలం టూరిజం స్పాట్లు, కొండలు, గుట్టలతో పాటు పేరొందిన లొకేషన్లకే పరిమితమైన ప్రీ వెడ్డింగ్, ఇతర శుభకార్యాల ఆల్బమ్ షూటింగ్స్ ఇప్పుడు నర్సింహులపేట మండలంలోని నర్సింహపురం, బంజర, పెద్దనాగారం ప్రకృతివనాల్లో జోరుగా జరుగుతున్నాయి.
ఆహ్లాదం, ప్రశాంతతకు నిలయాలు..
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యంగా పల్లె ప్రకృతి వనాలు గ్రామీణ ప్రజలకు ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.వాకింగ్ చేసేందుకు, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఏర్పాటుచేయడంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వాకింగ్‌తో పాటు ఉదయం, సాయంత్రం యోగా చేసేందుకూ ఈ వనాలు ఉపయోగపడుతున్నాయి. నర్సింహులపేట మండలంలోని నర్సింహపురం బంజర, పెద్దనాగారం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను అందంగా నిర్మించారు. ప్రధానంగా బంజరలో పల్లె ప్రకృతి వనాన్ని గుట్టల నడుమ ఏర్పాటుచేయడం, ఆ రాళ్లు కనిపించకుండా రకరకాల బొమ్మలను రంగులతో తీర్చిదిద్దారు. దీనికి తోడు పార్కు మధ్యలో గౌతమబద్ధుడి విగ్రహాంతో పాటు పిల్లలు ఆడుకునేందుకు ఉయ్యాల, జారుడు బల్ల కూడా అమర్చడం అందరినీ కట్టిపడేస్తోంది. ఇలా రాళ్లకు వేసిన రంగురంగుల బొమ్మలు.. పచ్చని చెట్ల నడుమ ఉన్న ఫొటోషూట్‌కు అనువుగా ఉంటున్నాయి.
ఖర్చు లేకుండా ఫొటో, వీడియో షూట్స్..
వివాహంతో పాటు వివిధ శుభకార్యాలకు ముందస్తుగా ఆహ్వానం కోసం తీసే ఫొటో, వీడియోలు చాలా ఖర్చుతో కూడినవి. వివిధ పట్టణాలు, నగరాల్లో ఫొటో, వీడియో షూట్స్ తీసేందుకు పార్కులకు నగదు చెల్లించాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన పల్లె ప్రకృతి వనంలో ఉచితంగా షూట్ చేసుకుంటున్నారు. పట్టణాల్లో ఉన్న పార్కులను మించి పచ్చని చెట్లు, వివిధ రకాల పూల మొక్కలు అందంగా దర్శనమిస్తున్నాయి.
లొకేషన్లు బాగున్నాయ్..
వివిధ శుభకార్యాలకు ఫొటో, వీడియో షూట్స్ తీసేందుకు హైదరాబాద్, వరంగల్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్ల్లేవాళ్లం. ఇప్పుడు అవసరం లేకుండా పోయింది. దగ్గరలోని పల్లె పకృతి వనంలోనే వీడియో, ఫొటో షూట్స్ తీసేందుకు వధూవరులు ఉత్సాహం చూపుతున్నారు. అక్కడి చెట్లు, రహదారులు రంగురంగుల బొమ్మలు ఫొటో, వీడియోల్లో అందగా కనిపిస్తున్నాయి.
– కడుదుల రవి, ఫొటోగ్రాఫర్
అందంగా తీర్చిదిద్దాం..
మా గ్రామంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనం గుట్టల మధ్య ఉన్నది. మొద ట మొక్కలు నాటేందుకు ఇబ్బందులు ప డ్డాం. తర్వాత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేర కు గుట్ట పక్కన ఉన్న రాళ్లకు అందంగా రంగురంగుల చిత్రాలు వేయించాం. దీనికి తోడు వనం మధ్యలో గౌతమ బుద్ధుడి విగ్రహం, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటుచేశాం. ఇక్కడ వివిధ శుభ కార్యాలకు ఫొటో, వీడియో షూట్స్ తీయడం సంతోషంగా ఉంది.
– గంట సాత్విక్, పంచాయతీ కార్యదర్శి
పార్కు అద్భుతంగా ఉంది..
మా గ్రామ శివారులోని పల్లె ప్రకృతి వనం అద్భుతంగా ఉంది. గుట్టల నడుమ పార్కు కట్టించడమే గాక ఆ రాళ్లకే రంగులతో బొమ్మలు వేయడం చూడముచ్చగా ఉంది. ఇంకా వనంలో ఆడుకునేందుకు జారుడుబండ, ఉయ్యాల కూడా ఉండడం వల్ల పిల్లలు కూడా సంబురంగా వెళ్తున్నారు. ఇప్పుడు పెండ్లికి, ఇతర శుభకార్యాలకు ఫొటోలు, వీడియోలు కూడా తీసుకునేందుకు వస్తున్నరు. ఒకప్పుడు ఇటు దిక్కు రావాలంటేనే భయమయ్యేది. ఇప్పుడదే పార్కు ఫేమస్ అయింది. చాలా సంతోషంగా ఉంది.
– గుగులోత్ కాలు