ఖానాపురం, మే 15: యాసంగి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ అన్నారు. మండలంలోని ఖానాపురం, మంగళవారిపేట, ధర్మరావుపేటలో ఖానాపురం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాకాల ఆయకట్టులో యాసంగిలో సాగు తక్కువగానే ఉన్నప్పటికీ ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతుల నుంచి చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, సర్పంచ్ లావుడ్యా రమేశ్‌నాయక్, ఎంపీటీసీలు మర్రి కవిత, బోడ భారతి, సొసైటీ డైరెక్టర్లు గంగాధర రమేశ్, సునీత, ఆబోత్ అశోక్, లక్ష్మణ్, వెన్ను పూర్ణచందర్, కరుణాకర్, సమ్మయ్య, మల్లయ్య, తొట్ల వెంకన్న, సీఈవో ఆంజనేయులు, సిబ్బంది రాజు, వినయ్, నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.
పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది..
వర్ధన్నపేట/పర్వతగిరి: యాసంగి ధాన్యాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్‌ఖన్నా అన్నారు. రాంధాన్తండా, నల్లబెల్లిలో వారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధాన్యాన్ని క్రమపద్ధతిలో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నదాతలను కోరారు. వాతావరణంలో మార్పులు వస్తున్నందున ధాన్యం తడువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నల్లబెల్లి సర్పంచ్ ముత్యం దేవేంద్ర, ఎంపీటీసీ దుగ్యాల జ్యోతి, ఆర్తండా సర్పంచ్, ఎంపీటీసీ, రైతులు పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని అనంతారంలో చౌటపెల్లి పీఏసీఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నదాతల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి మధుసూదన్‌రావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.