వరంగల్, ఏప్రిల్ 26(నమస్తేతెలంగాణ) : పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులన్నీ జెండా పండుగలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీ గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతు బంధు సమితి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కలిసి జెండా పండుగ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు టీఆర్ఎస్ జెండా ఎగరాలని, దీంతో పాటు పట్టణాల్లోని బస్తీలు, వార్డు కమిటీల ఆధ్వర్యంలోనూ జెండాలు ఎగురవేయాలని సూచించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నర్సంపేట, వరంగల్‌తూర్పు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. ఊరూరా గులాబీ జెండాను ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పెద్ది పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల వలె పరుగులు పెడుతూ దేశంలోనే రాష్ట్రం అత్యున్నత స్థాయికి చేరిందని, ఈ ప్రయాణంలో టీఆర్ఎస్ శ్రేణుల కృషి, భాగస్వామ్యం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.
టీ ఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యదీక్షతో పార్టీ 21వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో బుధవారం ఊరూరా, పట్టణంలోని ప్రతి వార్డులో గులాబీ జెండాలను ఎగురవేయాలని పార్టీ శ్రేణులను కోరారు. వరంగల్‌తూర్పు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో వాడవాడనా ఘనంగా గులాబీ జెండా ఎగురవేయాలని, పండుగలా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని ఎమ్మెల్యే నన్నపునేని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్వరాష్ట్ర కాంక్షను నిజం చేసి అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను ముందువరుసలో నిలిపిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ను తిరుగులేని రాజకీయ శక్తిగా నిలుపడంలో పార్టీ శ్రేణుల కృషి గొప్పదని ఆయన పేర్కొన్నారు. కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకవర్గం, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, వివిధ స్థానిక సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు జెండా పండుగలో పాల్గొనాలని కోరారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించి వేడుకలు ఘనంగా జరుపాలని అన్నారు.
జెండా రెపరెపలాడాలి..
పార్టీ జెండా పండుగలో టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఒక ప్రకటనలో కోరారు. జిల్లావ్యాప్తంగా బుధవారం గులాబీ జెండా రెపరెపలాడాలని, గ్రామ గ్రామాన పండుగ వాతావరణం నెలకొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో కంకణబద్ధులై మరింత ఉజ్వలమైన తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మండల, గ్రామ, డివిజన్, వార్డు అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, రైతుబంధు సమితి బాధ్యులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులందరూ జెండా పండుగలో భాగస్వాములు కావాలని కోరారు.
ప్లీనరీకి మనోళ్లు..
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ప్లీనరీ జరుగనుంది. పార్టీ ప్రతినిధుల మహాసభకు జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీ చైర్పర్సన్, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలు హాజరు కానున్నారు. వీరిలో పలువురు ప్లీనరీ కోసం సోమ, మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. కొందరు బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీకి చేరుకొనేలా ప్లాన్ చేసుకున్నారు. పార్టీ నిర్దేశించిన ప్రతినిధులకు పాసులు అందినవో లేదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని, ఈ అంశానికి సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పార్టీని సంప్రదించాలని మంత్రి కేటీఆర్ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులు ఉదయం 9 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకొనేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. పార్టీ ప్రతినిధులు కచ్చితంగా ఉదయం 9 గంటల్లోపే తమ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ గులాబీ దుస్తులు ధరించి రావాలన్నారు. ఉదయం పది గంటల్లోపు సమావేశ మందిరంలో ఆసీనులు కావాలని మంత్రి కేటీఆర్ పార్టీ ప్రతినిధులకు సూచించారు.