వాజేడు, ఏప్రిల్,17 : గోదావరి ఒడ్డున.. దట్టమైన అటవీ ప్రాంతంలో గుట్టపై వెలసిన బీరమయ్య (భీష్మ శంకరుడు) జాతర ఆదివారం ఘనంగా జరిగింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దు ప్రాంతం.. వాజేడు మండలం టేకులగూడెం పంచాయతీ పరిధిలో హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారికి కిలో మీటర్ దూరంలో ఉన్న లొటపిటగండిలో గుట్టపై స్వయంభువుగా వెలిసిన బీరమయ్యకు నాలుగు రాష్ర్టాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, పక్క రాష్ర్టాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి శనివారం రాత్రి వరకే భారీ సంఖ్యలో తరలివచ్చి ఆదివారం కోళ్లు, మేకలను బలిచ్చి వనభోజనాలతో ఇంటిల్లిపాదీ ఆనందంగా గాడిపారు.
ఏటా శ్రీరామనవమి అనంతరం మొదటి ఆదివారం టేకులగూడేనికి చెందిన పూజారులు, భక్తులు బీరమయ్య జాతర నిర్వహిస్తారు. శనివారం మధ్యహ్నమే గోదావరి నుంచి లక్ష్మీదేవరను, పవిత్ర జలాలను తీసుకొచ్చి స్వామివారి రాతి విగ్రహాన్ని శుద్ధి చేశారు. శనివారం రాత్రి చుట్టుపక్కల గ్రామలవారు తమ సంప్రదాయ గిరిజన నృత్యాలు చేసి అలరించారు. ఆదివారం వేలాదిమంది జాతీయ రహదారి నుంచి గుట్టపైకి కాలినడకన వచ్ఛి కుటుంబాల సమేతంగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గోదావరి ఒడ్డున, ఆలయ పరిసరాల్లో కోళ్లు, మేకలు బలిచ్చి వన భోజనాలు చేసి సేదతీరారు. గోదావరి అవలి ప్రాంతం నుంచి భక్తులు నాటు పడవల్లో తరలివచ్చారు. బైక్లు, కార్లు, ట్రాక్టర్లలో వేలాదిగా బారులు తీరారు. జాతరలో వెలసిన దుకాణాల్లో బొమ్మలు, ఇతర వస్తువలు కోనుగోలు చేసి సందడిగా గడిపారు. వచ్చే ఆదివారం తిరుగువారంతో జాతర ముగుస్తుందని ఆలయ పూజారులు వాసం బాబు, కుర్సం సురేశ్ తెలిపారు.
భక్తులపై తేనెటీగల దాడి 
జాతరకు వచ్చి గోదావరి ఒడ్డున వంటలు చేసుకుంటున్న కొందరు భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో ప్రధాన రహదారి వైపు పరుగులు తీశారు. కొందరు ఆటోలు, ట్రాక్టర్ల కింద దాక్కున్నారు. మరికొందారు గోదావరి నీటిలోకి వెళ్లి రక్షణ పొందారు. తేనెటీగాల దాడిలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు.
1982 నుంచి జాతర
బీరమయ్యజాతరను 1982 నుంచి చేస్తున్నం. గతంలో రో డ్డు సౌకర్యం సరిగాలేక భక్తులు ముందే వచ్చి ఇక్కడ ఉండి జాతర ముగిసేదాకా ఉండేటోళ్లు. ఇప్పు డు రోడ్లు బాగైనయ్. ఎప్పటికప్పుడు వచ్చి దర్శనాలు చేసుకొని పోతున్నరు. గుడిని అప్పటి పేరూరు ఎస్ఐ, ఇప్పటి ఏటూరునాగారం సీఐ సట్ల కిరణ్కుమార్ కట్టించిండు. ప్రభుత్వం ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తే జాతర ఇంకా బాగా చేసుకుంటం.
– యాలం అచ్చయ్య, నిర్వాహకుడు