సుబేదారి, ఏప్రిల్ 17: వాట్సాప్ ద్వారా వచ్చే అభ్యర్థనలకు పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి సూచించారు. గతంలో ఫేస్బుక్ ఆధారంగా సైబర్ నేరాలకు పాల్పడి, ప్రస్తుతం ఉన్నతాధికారుల ఫొటోలతో నేరాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు నకిలీ అభ్యర్థనలను పంపించి నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సీపీ పేర్కొన్నారు. గత నెల 28న వరంగల్ కలెక్టర్ గోపి ఫొటోను వాట్సాప్ డీపీగా వినియోగించుకుని అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపించాలని రెవెన్యూ అధికారికి నకిలీ సందేశం పంపించారని పేర్కొన్నారు. సదరు అధికారి కలెక్టర్ గోపిని సంప్రదించకుండానే రూ.1.50 లక్షల కూపన్ పంపించారని, కొద్దిసేపటికే మోసానికి గురైనట్లు నిర్ధారించుకున్న ఆయన వెంటనే కలెక్టర్ గోపి దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. కలెక్టర్ సూచన మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు వివరించారు. మోసానికి పాల్పడింది జార్ఖండ్‌కు చెందిన నేరగాళ్లుగా గుర్తించామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని సీపీ తెలిపారు. సైబర్ నేరగాళ్లపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి సూచించారు. నకిలీ సందేశాలపై తక్షణమే స్పందించి 1930 సైబర్ విభాగానికి సమచారం అందించాలని కోరారు.
ఐదుగురు ఎస్సైల బదిలీ 
సుబేదారి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ కమిషనర్ తరుణ్‌జోషి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. కమిషనరేట్ వీఆర్‌లో ఉన్న డీ ప్రవీణ్‌కుమార్‌ను మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్‌కు బదిలీచేశారు. హసన్‌పర్తి ఎస్సై డీ సాంబయ్య సస్పెండ్ కావడంతో ఆయన స్థానంలో కమిషనరేట్‌కు అటాచ్డ్గా ఉన్న ఎన్ రవికిరణ్‌కు పోస్టింగ్ ఇచ్చారు. నర్మెటలో పనిచేస్తున్న సీహెచ్ రవికుమార్ సస్పెండ్ కావడంతో ఆయన స్థానంలో కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ నవీన్‌కుమార్‌కు పోస్టింగ్ ఇచ్చారు. సీపీ అటాచ్డ్గా ఉన్న సయ్యద్ పాషాను ఇంతేజార్గంజ్కు, మిల్స్‌కాలనీలో పనిచేస్తున్న జీ సత్యనారాయణను కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బదిలీచేశారు.