ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమం అమలును అధికారులు వేగవంతం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన అంచనాలు రూపొందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 180 పాఠశాలలకు సంబంధించి ఎస్టిమేట్స్ పూర్తి చేశారు. వీటిలో తొలి విడుత 38 స్కూళ్లలో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.5.13 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రాయపర్తి మండలంలోని కొండూరు మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో పరిపాలనా అనుమతులు వచ్చిన ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వరంగల్, ఏప్రిల్ 16(నమస్తేతెలంగాణ) : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా మూడు విడుతల్లో సర్కారు స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించింది. తొలివిడుత విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి వీటిలో మౌలిక వసతులు కల్పించేందుకు ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి దశ అభివృద్ధి చేసేందుకు 223 పాఠశాలలను సెలెక్ట్ చేసింది. వీటిలో 123 ప్రాథమిక, 20 ప్రాథమికోన్నత, 80 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో పన్నెండు అంశాలపై మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ) చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్, అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ)లు పాఠశాలల్లో అవసరాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అలాగే, ప్రతి మండలానికి కలెక్టర్ నియమించిన ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఈ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు పన్నెండు అంశాలపై అంచనాలు తయారు చేసి ఎంవోఎంబీ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. వీటిని ఇంజినీరింగ్ విభాగాల ఉన్నతాధికారులు పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత పనులు చేపట్టేందుకు కలెక్టర్ పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నారు.
ఎంపికైన పాఠశాలలు ఇవే..
కార్యనిర్వాహక ఇంజినీర్(ఈఈ)లు ఆమోదం తెలిపిన స్కూళ్ల ఎస్టిమేట్స్‌లో ఇప్పటికే కలెక్టర్ 38 పాఠశాలలకు సంబంధించి రూ.5,13,75,590 పరిపాలనా అనుమతులు ఇచ్చారు. అనుమతులు పొందిన పాఠశాలల్లో గీసుగొండ మండలం మొగిలిచర్ల, మనుగొండ యూపీఎస్‌లు, దుగ్గొండి మండలం దుగ్గొండి, మందపల్లి పీఎస్‌లు, నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లి, కొం డాయిలపల్లి పీఎస్‌లు, నర్సంపేట మండలం ఇటికాలపల్లి, ముత్తోజీపేట యూపీఎస్‌లు, లక్నేపల్లి, మహేశ్వ రం, జీడయ్యపల్లి, హనుమన్దేవల్, నర్సంపేట మోడ ల్ పీఎస్‌లు, ఖానాపురం మండలం కొత్తూరు, ధర్మారావుపేట పీఎస్‌లు, చెన్నారావుపేట పీఎస్, సంగెం మండలం షాపూర్, తీగరాజుపల్లి, సంగెం పీఎస్‌లు, వర్ధన్నపేట మండలం కాశగూడెం, కట్య్రాల, ఫిరంగిగ ఢ్ పీఎస్‌లు, రాయపర్తి మండలం కొండూరు, తిర్మలాయపల్లి పీఎస్‌లు, పర్వతగిరి మండలం కొంకపాక, చౌ టపల్లి, గుంటూరుపల్లి, పర్వతగిరి, టూక్యానగర్, కల్లె డ, పెద్దతండా పీఎస్‌లు, నెక్కొండ మండలం నెక్కొం డ, రెడ్లవాడ, అప్పల్రావుపేట పీఎస్‌లు, వరంగల్ మండలం దేశాయిపేట, మట్టెవాడ పీఎస్‌లు, ఖిలావరంగల్ మండలం రంగశాయిపేట(జీ), ఉర్సు(టీఎం) పీఎస్‌లు ఉన్నట్లు విద్యాశాఖ జిల్లా అధికారి డీ వాసంతి వెల్లడించారు. వీటిలో రాయపర్తి మండలం కొండూరు పీఎస్‌లో అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శంకుస్థాపన చేశారు. మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలకు మరమ్మతులు, విద్యుదీకరణ, నూతన గదుల నిర్మాణం, ఫర్నిచర్, పెయింటింగ్స్, రాత బోర్డు, ప్రహరీ, నిరంతర నీటి సరఫరా, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్ వంటి వసతులు కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈక్రమంలో జిల్లాలోని ఇతర పాఠశాలల్లోనూ మౌలిక వసతులు కల్పించే పనులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎస్ఎంసీలకు పనులు..
మరో 140 పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం ఇంజినీర్లు ఎస్టిమేట్స్ పూర్తి చేశారు. ఈఈలు ఆమోదం తెలుపుతున్న వీటికి కలెక్టర్ పరిపాలనా అనుమతులు ఇవ్వనున్నారు. తొలివిడుత అభివృద్ధి చేసేందుకు జిల్లాలో ఎంపిక చేసిన మిగతా స్కూళ్లలో కూడా ఇంజినీర్లు అంచనాలు తయారు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో ఎస్టిమేట్స్ పూర్తి చేసి పరిపాలనా అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం ఇంజినీరింగ్ విభాగాల అధికారులను ఆదేశించింది. ఎస్‌ఎంసీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ఆయా స్కూళ్లతో ఎస్ఎంసీలు ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం పరిపాలనా అనుమతులు మంజూరైన పాఠశాలల ఎస్ఎంసీ చైర్మన్, హెచ్ఎం, సర్పంచ్, ఏఈ సంతకాలతో కూడిన అగ్రిమెంట్లను ఎంవోఎంబీ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఒప్పందం జరిగిన తర్వాత పనులు చేసేందుకు ఎస్ఎంసీకి ప్రభుత్వం ఆయా పాఠశాల పనుల అంచనా విలువలో 15 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇవ్వనుంది.