బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట తెలంగాణపై కుట్ర పన్నారని, ఆయనది తెలంగాణ విద్రోహ యాత్ర అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్‌తో కలిసి శనివారం హనుమకొండలోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఎనిమిదేళ్లుగా తెలంగాణకు కేంద్రం ఒరగబెట్టిందేమీ లేదు.. రాష్ర్టానికి మీరు తెచ్చిన నిధులెన్ని?, అభివృద్ధికి ఏవిధంగా సహకరించారు?, సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన చేయూత ఏమిటి? అనేది ప్రజలకు వివరించి పాదయాత్ర చేస్తే బాగుండేది’ అని కడియం దుయ్యబట్టారు.
హనుమకొండ, ఏప్రిల్ 16 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టింది ప్రజా సంగ్రామ యాత్ర కాదని, అది తెలంగాణ విద్రోహ యాత్ర అని, ప్రజలను త ప్పుదోవ పట్టించాలని యాత్ర పేరుతో నాటకాలు ఆడుతున్నాడని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు.. తెలంగాణ సంక్షేమాన్ని నీరుగార్చేందుకు.. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూసి ఓర్వలేక బండి యాత్ర చేపట్టినట్లుగా భావిస్తున్నామన్నారు. ఎనిమిదేళ్లలో తె లంగాణకు ఒక్క ప్రాజెక్టు, లేదా విద్యా సంస్థను ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం పూర్తిగా పక్షపాత ధోరణితో పోతున్నదని మండిపడ్డారు. తనకాళ్లపై తాను నిలబడి వనరులను సమీకరించుకొని అభివృద్ధి చెందుతున్న తెలంగాణ పేరును చెడగొట్టాలనే దురుద్దేశంతోనే బండి యాత్ర చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలని, రైతును రాజు చేయాలని ఒక విధానంతో దేశ నేతగా సీఎం కేసీఆర్ గుర్తింపు పొందుతుంటే చూసి ప్రధాని నరేంద్ర మోదీ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
బీజేపీ తుచ్చ విధానాలను, నియంతృత్వ ధోరిణిని ఎక్కడ ఎండగడుతారోనని, అవినీతిని, పక్షపాతాన్ని ఎక్కడ దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ వివరిస్తాడోననే భయంతోనే మోదీ ఆదేశాల మేరకు బండి యాత్ర చేస్తున్నాడని దుయ్యబట్టారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీనైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లా చిరకాల వాంఛ అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీల్లో ఒక్కటైనా ఏర్పాటు చేశారా? అని నిలదీశారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇప్పించారా? అభివృద్ధికి ఏనాడైనా నిధులు తెచ్చారా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవేవీ లేకుండా పాద యాత్ర చేస్తున్నారంటే వారి దుర్బుద్ధి ఏమిటో తెలిసిపోతున్నదన్నారు. ఇతర రాష్ర్టాల్లో గిరిజన యూనివర్సిటీని ప్రారంభించి, ములుగుకు ఎందుకు తేలేదో బీజేపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన ఏ అంశంపైనా కేంద్రాన్ని మెప్పించి ఒప్పించలేని చాతగాని, చేవలేని సన్నాసులు..
దద్దమ్మలు బీజేపీ ఎంపీలని మండిపడ్డారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం రాద్దాంతం చేస్తున్నా రైతులకు ఇబ్బందులు కలుగవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొంటుంటే ‘మేమే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తున్నం’ అని బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీది రైతు, దళిత వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. తెలంగాణలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లే 2014-15లో 36లక్షల ఎకరాలు సాగవుతే 2021లో కోటీ 10లక్షల ఎకరాలు సాగయ్యాయని స్పష్టం చేశారు. ఆహార భద్రత, ప్రొక్యూర్మెంట్ పాలసీ, ఎఫ్‌సీఐ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం కేంద్రం చేతిలోనే ఉన్నాయని, ధాన్యం కొనుగోలులో కుంటి సాకులు చూపుతున్నదని, తెలంగాణ వ్యతిరేక బీజేపీ మనకు అవసరమా? అని ప్రశ్నించారు.
దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నరు..
తెలంగాణతో పాటు దేశ ప్రజలు కూడా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనకుండా ఇక్కడి ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని కించపరిచిన బీజేపీ నాయకులకు తెలంగాణలో పాదయాత్ర చేసే నైతిక హకు లేదన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఇక్కడ తిరిగితే బాగుండేదని హితవుపలికారు. తెలంగాణకు ఏం చేశారో సమీక్షించుకొని యాత్ర చేయాలని, లేదంటే ఉన్నపలంగా యాత్రను ముగించాలని, లేదంటే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరని స్పష్టం చేశారు.
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేరు.. 
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఏ శక్తీ అడ్డుకోలేదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బీజేపీ సంగ్రామం ఎవరిపై చేస్తున్నదో, ఎందుకు యాత్ర చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం అందిస్తున్న సంక్షేమ పథకాలను రాకుండా చేసేందుకు ఈ యాత్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. బండి యాత్ర వెనుక కుట్ర దాగి ఉందని, దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. బండి యాత్రను తెలంగాణ ప్రజలు ఆదరించరని తెగేసి చెప్పారు. సమావేశంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న పాల్గొన్నారు.