ఖిలావరంగల్, ఏప్రిల్ 17 : ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బీ గోపి అన్నారు. శనివారం కలెక్టరేట్లో వ్యవసాయ, పౌర సరఫరాలు, పోలీసు శాఖలు, రైతు సంఘం నాయకులు, మిల్లర్స్ అసోసియేషన్, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదన్నారు. జిల్లాలో వరి కోతలకు ఇంకా 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షా 86వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందన్నారు. గతంలో 186 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ సారి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రవాణా విషయంలో కొత్త రేట్లు ఇంకా రాలేదని, ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. ఈసారి గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూస్తామని, ఇప్పటికే ఆరు లక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. గన్నీ బ్యాగుల విషయంలో సవిల్ సప్లయ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీవత్స కోటను ఆదేశించారు. టార్పాలిన్, ప్యాడీ క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒక కిలో కూడా తరుగు లేకుండా ఉండాలంటే ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ సంపత్‌రావు, నర్సంపేట ఆర్డీవో పవన్‌కుమార్, మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్, డీఎంవో ప్రసాదరావు, డీసీవోబీ శ్రీనివాస్‌రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.