జనగామ, ఏప్రిల్6(నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ సర్కారు మెడలు వంచి, రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసే వరకు నిరసనలు, ఆం దోళనలు ఆపేది లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. దేశంలో చిన్న, సన్నకారు రైతాంగానికి నష్టం జరిగే లా తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో టీఆర్ఎస్ పోరాటం చేసినందు కే కేంద్రం తెలంగాణపై కక్షకట్టి ధాన్యం కొనుగోలుపై పేచీలు పెడుతున్నదని ఆరోపిం చారు. బుధవారం జనగామలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జడ్పీచైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లా డారు.
తెలంగాణ రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగిందని, బీజేపీ సర్కారు విధానాలు, ఆ పార్టీ రాష్ట్ర నేతల తీరును అడుగడుగునా ఎండగట్టాలని కోరారు. యాసంగి ధాన్యం కొను గోలుపై కేంద్రప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన రైతు నిరసన దీక్షలను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ రైతులంతా ఏకం కావాలని.. అవసరమైతే దేశంలోని అన్నదాతలను కలుపుకొని ధాన్యం అంశంపై ఉద్యమించాలన్నారు. పార్లమెంట్లో ఎంపీలు నిలదీసినా కేంద్రం దిగి రావడంలేదని, కేంద్ర మంత్రి రా రైస్ మాత్రమే కొంటాం అంటున్నారని.. కావాలనే బీజేపీ తెలంగాణను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులతో వరి పంట సాగు గణనీయంగా పెరి గిందని, 24గంటల కరంటుతో వడ్లు తప్ప వేరే పంట వేస్తే పండే పరిస్థితి లేదని.. ఇప్పటికే గతంలో తీసుకున్న ధాన్యంతో గోదాములన్నీ నిండి ఉన్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ కొనే బాధ్యత మా ది రైతులు వరి వేయండి అని మభ్యపెట్టి, ఇప్పుడు కేంద్రం ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేస్తే.. ఆ నాయకులు మాట మారుస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలుపై క్లారిటీ ఇవ్వకుండా ఇప్పటికీ పిచ్చి మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకించిన మొదటి పార్టీ టీఆర్ఎస్ అని తెలిపారు. రైతుల ఉత్తరాది రాష్ర్టాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోదీ నల్లచట్టాలను వెనక్కి తీసు కున్నారని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి రైతు తన ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలని, గ్రామాల్లో కేంద్రం, బీజేపీ నాయకుల దిష్టిబొమ్మలకు శవయాత్రలు చేసి దహనం చేయాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ధాన్యం కొనకపోతే కేంద్రంతో నూకలు తినిపిస్తామని, తెలంగాణ తెగువ ఏంటో చూపిస్తామని హెచ్చరిం చారు. ఉపాధిహామీ పథకానికి రూ.25వేల కోట్ల కోత విధించారని, 15లక్షల పని దినాలను 10లక్షలకు కుదించారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎస్సీ వర్గీకరణ లేదు.. కోచ్ ఫ్యాక్టరీ లేదు.. బయ్యారం ఉక్కు పక్కనబెట్టారు.. విభజన హామీలను వదిలేశా రు.. అడుగడుగునా చూపిస్తున్న వివక్షను తిప్పికొట్టాలి’ అని పిలుపునిచ్చారు.