గీసుగొండ, జనవరి 27 : పచ్చదనం, పరిశుభ్రతపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని కలెక్టర్ గోపి అన్నారు. మండలంలోని మరియపురం, కోనాయిమాకుల గ్రామాల్లో గురువారం కలెక్టర్ పర్యటించారు. పల్లె పకృతి వనాలు, నర్సరీలు, డంపింగ్ యార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరియపురం జీపీ నర్సరీలో అన్ని రకాల మొక్కలతో పాటు క్లోనింగ్ జామ మొక్కలు పెంచడం బాగుందన్నారు. పరిశుభ్రత విషయంలో రాజీపడకూడదన్నారు. నర్సరీలో పెరిగే మొక్కలను ప్రతి ఇంటికీ పంపిణీ చేయాలని సూచించారు. నర్సరీలో ప్రైమరీ బెడ్లను ఏర్పాటు చేసి వంద శాతం మొక్కలు బతికేలా చూడాలన్నారు. భూగర్భ జలాలు పేరిగేందుకు ఏర్పాటు చేసిన బోర్ రీచార్జి పిట్ అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసుకునేలా అధికారులు చూడాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీవో సంపత్‌రావు, ఆర్డీవో మహేందర్‌జీ, తహసీల్దార్ సుహాసిని, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీవో ప్రభాకర్, ఏపీవో మోహన్‌రావు, సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, గోలిరాధాబాయి తదితరులు పాల్గొన్నారు.
స్థల పరిశీలన..
పోచమ్మమైదాన్ : ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు)లను భద్రపరచడానికి అవరసమయ్యే గోదాముల నిర్మాణం కోసం కలెక్టర్ బీ గోపి గురువారం స్థలాన్ని పరిశీలించారు. వరంగల్ దేశాయిపేటలోని లక్ష్మి మెగా టౌన్ షిప్ సమీపంలోని ప్రభుత్వ స్థలం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ మ్యాప్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్డీవో మహేందర్‌జీ, తహసీల్దార్ సత్యపాల్‌రెడ్డి, ఆర్ అండ్ బీ అధికారులు ఉన్నారు. అలాగే, ఖిలా వరంగల్‌లో కూడా గోదాముల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు.