ప్రభుత్వ భూముల్లో ఉన్న ఇండ్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దీంతో పేదలు సంతోషం వెలిబుచ్చుతున్నారు. కొద్ది రోజుల నుంచి సంబురాలు జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావుతో పాటు స్థానిక ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాలో వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. వరంగల్‌తో పాటు నర్సంపేట పట్టణంలోని అనేక మందికి ప్రయోజనం కలుగనుంది. సర్కారు స్థలాల్లో ఇండ్లు కలిగిన వారు మీసేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తున్నారు.
– వరంగల్, ఫిబ్రవరి 25 (నమస్తేతెలంగాణ)
ప్రభుత్వ భూముల్లో ఉన్న ఇండ్ల క్రమబద్దీకరణకు అవకాశం కల్పిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి 2014 డిసెంబర్ 30న జీవో 58, 59 జారీ చేసింది. ఆ తర్వాత అభ్యంతరం లేని ఇండ్ల క్రమబద్ధీకరణకు గడువును పెంచుతూ జీవో 58, 59లకు కొనసాగింపుగా 2015 జనవరిలో జీవో 12, 2017 ఫిబ్రవరిలో జీవో 35, డిసెంబర్లో జీవో 283 జారీ చేసింది. తాజాగా జీవో 58, 59 ద్వారా ఇండ్ల క్రమబద్ధీకరణకు మరోసారి వెసులుబాటు కల్పిస్తూ కొద్దిరోజుల క్రితం జీవో 14 విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. కొత్తగా జారీ అయిన జీవో 14తో పేదల సొంత భూమి కల తీరనుంది. 125 చదరపు గజాల్లోపు ప్రభుత్వ స్థలంలో ఇండ్లు ఉన్న వారు ఉచితంగా క్రమబద్ధీకరించుకొనే అవకాశం కలిగింది. ఈ జీవో ప్రకారం ఈ నెల 21 నుంచి మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. దీంతో అర్హతలు గల వారు దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఫలించిన నన్నపునేని కృషి..
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృషి ఫలించింది. అసెంబ్లీ సాక్షిగా ఆయన తూర్పు నియోజకవర్గం పరిధిలోని గుడిసెవాసుల గోడు వినిపించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో జీవో 58, 59 ప్రకారం వరంగల్‌లోని పేదలకు పట్టాలందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిసి ఇదే విషయాన్ని చెప్పారు. పేదల మనసు తెలిసిన సీఎం కేసీఆర్ వరంగల్ ప్రజలకు శుభవార్త చెప్పారు. మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం కొత్తగా జీవో 14 జారీ చేసింది. దీంతో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ క్రమబద్ధీకరణ జరుగనుంది. ఇప్పటికే పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే సంకల్పంతో వరంగల్ గుడిసెవాసులపై ప్రభుత్వం సర్వే నిర్వహించింది. సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరింది. వెరసి పేదలకు పట్టాలందించే ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో పేదలు తమ భూమికి పూర్తి హక్కుదారులుగా మారనున్నారు.
నర్సంపేటలో ‘పెద్ది’ పట్టుదల..
క్రమబద్ధీకరణ కోసం వెలువడిన జీవో 14తో నర్సంపేట పట్టణంలోనూ అనేక మందికి లబ్ధి కలుగనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ ప్రభుత్వ, అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలని స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. ముఖ్యంగా 111, 702 సర్వే నంబర్లలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలని పలు సందర్బాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పెద్ది కృషి ఫలించింది. సీఎం కేసీఆర్ స్పందించి జీవో 14 జారీ చేయడంతో క్రమబద్ధీకరణకు అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో నర్సంపేట పట్టణ ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం నర్సంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి సంబురాలు చేసుకున్నారు.
పేదల బంధువు సీఎం కేసీఆర్..
– నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యే, వరంగల్ తూర్పు
పేద ప్రజల కోసం నిత్యం ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ జీవో 14 విడుదల చేయడం సంతోషం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అసెంబ్లీ సాక్షిగా పేదల భూములకు పట్టాలివ్వాలని అభ్యర్థించాం. పలుమార్లు వారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాం. రెక్కాడితేగాని డొక్కాడని ఎన్నో పేద కుటుంబాలు సొంత జాగ లేక ప్రభుత్వ భూముల్లో ఎన్నో ఏండ్లుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వారికి సొంత జాగ, భూమి పట్టా అనేది గత ప్రభుత్వాల పాలనలో కలగానే మిగిలిపోయింది. ఏ ప్రభుత్వాలు వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటి పేదల గోడు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్, కేటీఆర్ తీర్చారు. వారి బతుకుల్లో వెలుగులు నింపారు.