నర్సంపేట రూరల్, డిసెంబర్ 17: అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని నివారించి వేగవంతం చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు అధికారులను కోరారు. నర్సంపేట మండల సర్వసభ్య సమావేశం శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మోతె కళావతి అధ్యక్షతన జరిగింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ 11. 45 గంటలకు ప్రారంభమైంది. నాగుర్లపల్లి, లక్నెపల్లి, పర్శనాయక్‌తండా, ఇటుకాలపల్లి, గురిజాల గ్రామాల్లో మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణం పూర్తి కాలేదని, వెంటనే సంబంధిత కాంట్రాక్టర్‌తో పనులు చే యించాలని ఆయా గ్రామాల ఎంపీటీసీలు ఉల్లేరావు ర జిత, బండారి శ్రీలత, భూక్యా వీరన్న, సర్పంచ్‌లు కొడారి రవన్న, రజిత డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఏఈ వెంటనే కాంట్రాక్టర్‌తో పనులు చేయిస్తామన్నారు. లక్నెపల్లిలో ఇటీవల మంజూరైన మినీ అంగన్వాడీ కేంద్రం టీచర్ నియామకంలో అవకతవకలు జరిగినట్లు తప్పుడు ప్రచారం జరగుతున్నదని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న అన్నారు. దీనిపై ఏసీడీపీవోను వివరణ కోరగా అంగన్వాడీ టీచర్ ఎంపికలో అక్రమాలు జరుగలేదని, 2018లో ఆన్లైన్ దరఖాస్తుల ఆధారంగా నియామకం జరిగిందన్నారు. వచ్చే నెలలో నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పీహెచ్సీ వైద్యాధికారి భూపేష్ కోరారు.
2022 సంవత్సరానికి గాను రైతుబీమాలలో తొమ్మిది మందికి రూ.45 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేశామని మండల వ్యవసాయ అధికారి కృష్ణకుమార్ తెలిపారు. మండలంలో 6,164 మంది రైతులకు 12వ విడుత పీఎం కిసాన్ నగదును వారి ఖాతాలో జమచేశామని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ తోటలకు ప్రభుత్వం రాయితీ ఇస్తున్నందున రైతులు వినియోగించుకోవాని ఉద్యానవనశాఖ అధికారి తిరుపతి చెప్పారు. మండల నోడల్ ఆఫీసర్ గుడిపూడి రాం చందర్రావు మాట్లాడుతూ మన ఊరు-మన బడి, తొలిమెట్టు కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. గురిజాల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి రూ.1.20 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వచ్చే మార్చి 31లోగా పనులు పూర్తి చేయాలన్నారు. అర్హులైన నిరుపేదలను గుర్తించి అంత్యోదయ కార్డులకు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని తహసీల్ధార్ రామ్మూర్తి కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాలకు అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. మృతుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వాసం రామ్మూర్తి, ఎంపీడీవో అంబటి సునిల్కుమార్రాజ్, ఏపీవో ఫాతిమామేరీ, ఏపీఎం కుందేళ్ల మహేందర్, సీనియర్ అసిస్టెంట్ సంతోశ్‌బాబు పాల్గొన్నారు.