వరంగల్, నవంబర్ 30: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుపడిన కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ షర్మిలకు తెలంగాణలో తిరిగే హక్కు లేదని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్లో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్తో కలిసి బుధవారం ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులపై షర్మిల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను తాలిబన్లతో పోల్చడం సరికాదని పేర్కొన్నారు. ప్రజలు కేసీఆర్ను తెలంగాణ గాంధీగా భావిస్తున్నారని ఆమె అన్నారు. షర్మిలకు తెలంగాణ ఉద్యమకారులను విమర్శించే హ క్కు లేదని ఆమె మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలన లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే షర్మిల రాష్ట్రంలో చిచ్చుపెట్టేందుకు కుట్ర చేస్తున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, తెలంగాణ ఉద్యమకారులపై వ్యక్తిగత దూషణలు చేయడం షర్మిల దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రౌడీలను వెంటేసుకుని షర్మిల పాదయాత్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల అత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన షర్మిల బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేయర్ డిమాండ్ చేశారు. పద్ధతి మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆమె హెచ్చరించారు.