వరంగల్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాను మరో జాతీయ అవార్డు వరించింది. రాయపర్తి మండలంలోని మైలారం మత్స్య పారిశ్రామిక సంఘం జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. ప్రపంచ మత్స్య పారిశ్రామిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం, దళారులు లేకుండా చేపలు, రొయ్యల వ్యాపారం నిర్వహిస్తుండటం, చేపలు, రొయ్యల పెంపకం తదితర అంశాల్లో ఉత్తమ పనితీరు కనబరిచింది. దీంతో దేశంలోని మత్స్య పారిశ్రామిక సంఘాలను వెనక్కి నెట్టి మైలారం మత్స్య సొసైటీ నంబర్ వన్‌గా నిలిచింది. ఈమేరకు మత్స్య సొసైటీ అధ్యక్షుడు బోయిని కుమారస్వామి సోమవారం డయ్యూ డామన్‌లో కేంద్ర మంత్రి నుంచి ప్రశంసాపత్రంతోపాటు రూ.2లక్షల నగదు బహుమతి అందుకోనున్నారు. జిల్లాలోని గీసుగొండ మండలం గంగదేవిపల్లికి, మరియపురం గ్రామ పంచాయతీలకు, పర్వతగిరి మండలానికి గతంలో జాతీయ ఉత్తమ అవార్డులు వచ్చిన విషయంతెలిసిందే.
జిల్లాకు జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభించింది. ఈసారి రాయపర్తి మండలంలోని మైలారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి జాతీయ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా లక్షలాది మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, తెలంగాణ రాష్ట్రంలోని మైలారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జాతీయ స్థాయిలో ఉత్తమ బహుమతికి ఎంపిక కావడం విశేషం. అవార్డు అందుకునేందుకు రావాలని మత్స్య సొసైటీ అధ్యక్షుడు బోయిని కుమారస్వామికి కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది.
గతంలో కొన్ని..
జిల్లాలోని గీసుగొండ మండలం గంగదేవిపల్లి గతంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు పొంది, ఇతర గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తోంది. పలు రాష్ర్టాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు నిత్యం సందర్శించి ఈ గ్రామ ప్రత్యేకతను తెలుసుకుంటున్నారు. గత ఏడాది ఇదే మండలంలోని మరియపురం గ్రామ పంచాయతీకి జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. అన్ని రంగాల్లో నిలుస్తున్నందున రాష్ట్రంలో ఉత్తమ పంచాయతీల జాబితాలో లభించింది. అంశాల్లో ఆదర్శంగా ఉన్నందున ఉత్తమ మండలాల లిస్టులో జిల్లా నుంచి పర్వతగిరి నిలిచింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ అవార్డును ప్రకటించింది.
శానిటేషన్, తాగునీటి సరఫరా, వీధిలైట్లు, నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, సోషల్ సెక్టార్ పెర్ఫార్మెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ నిర్వహణ వంటి తొమ్మిది ఉత్తమ ఫలితాలను సాధించిన పర్వతగిరి మండలాన్ని జాతీయస్థాయిలో ఉత్తమంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాల్ ఉపాధ్యాయ సశక్తీకరణ్ పురస్కార్ (డీడీయూపీఎస్‌పీ)ను ప్రదానం చేసింది. నేషనల్ పంచాయతీ పొందిన గ్రామ పంచాయతీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, పర్వతగిరి మండల ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందనలు తెలిపారు. జాతీయస్థాయిలో తమకు గుర్తింపు తెచ్చిన మరియపురం సర్పంచ్, పర్వతగిరి మండల ప్రజాప్రతినిధులు, అధికారులను స్థానికులు పండుగ వాతావరణంలో సన్మానించారు.
ఈసారి ఉత్తమ మత్స్య సొసైటీ..
ప్రపంచ మత్స్య పారిశ్రామిక పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో ఒకదాన్ని గుర్తించి జాతీయ అవార్డు అందజేస్తుంది. ఈ ఏడాది జాతీయ ఉత్తమ అవార్డుకు మైలారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు మత్స్యశాఖకు సమాచారం ఇచ్చింది. ప్రపంచ మత్స్య పారిశ్రామిక దినోత్సవం సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ డామన్‌లో సోమవారం జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి నుంచి మైలారం మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం అధ్యక్షుడు బోయిని కుమారస్వామి ప్రశంసాపత్రంతోపాటు రూ.2లక్షల నగదు బహుమతిగా అందుకోనున్నారు. అందుకు ఆదివారం బయల్దేరి వెళ్లినట్లు మత్స్యశాఖ జిల్లా అధికారి నరేశ్‌కుమార్‌నాయుడు వెల్లడించారు. మైలారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరిచి జాతీయ ఉత్తమ అవార్డును కైవసం చేసుకుందని ఆయన తెలిపారు. రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం, దళారుల ప్రమేయం లేకుండా చేపలు, రొయ్యల వ్యాపారం నిర్వహిస్తుండటం, చేపలు, రొయ్యల పెంపకం తదితర అంశాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిందని వివరించారు.
రిజర్వాయర్‌లో చేపలు, రొయ్యల పెంపకం
మైలారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో 155 మంది సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఉన్న మైలారం రిజర్వాయర్ వీరికి ఆదాయ వనరు. ప్రభుత్వం ఏటా వందశాతం సబ్సిడీపై చేప, రొయ్య పిల్లలను మత్స్యశాఖ ద్వారా అందిస్తోంది. ఈ ఏడాది ఇటీవల 9.12 లక్షల చేపపిల్లలు, 4.56లక్షల రొయ్య పిల్లలను మత్స్యశాఖ అధికారులు ఈ రిజర్వాయర్‌లో వదిలారు. ఈ రిజర్వాయర్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం పరిధిలో ఉండటం గమనార్హం. దీంతో ఇక్కడి మత్స్యకారులకు ఆయన తనవంతు సహకారం అందిస్తున్నారు. దేశంలోని మత్స్య పారిశ్రామిక సహకారం సంఘాలెన్నో పోటీ పడగా మంత్రి ఎర్రబెల్లి, కలెక్టర్ బీ గోపి సహకారంతో తమ సంఘానికి జాతీయ ఉత్తమ అవార్డు రావడంపై మైలారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.