రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు – మన బడి కార్యక్రమం కింద జిల్లాలోని సర్కారు బడుల్లో చేపట్టిన మొదటి విడుత అభివృద్ధి పనులు చివరిదశకు చేరాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 898 పాఠశాలలు ఉండగా, వాటిలో మొదటి విడుతలో ప్రాథమిక 198, ప్రాథమికోన్నత 42, జడ్పీ, ఉన్నత పాఠశాలలు 76 కలిపి 316 ఎంపిక చేసి నిధులు కేటాయించారు. అన్నిశాఖల అధికారుల భాగస్వామ్యంతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రహరీలు, హైస్కూళ్లలో డైనింగ్ హాళ్లు, మరుగుదొడ్లు, హ్యాండ్‌వాష్, తాగునీటి కోసం సంపు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. అదనపు తరగతి గదులు, విద్యుత్, వంటశాల, మైనర్ పనులు తుది దశలో ఉన్నాయి. కొద్ది రోజుల్లో పెయింటింగ్ కూడా పూర్తయి పాఠశాలలు అద్దంలా
మెరువనున్నాయి.
నెల్లికుదురు, నవంబర్ 16 : కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడులను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి’ కార్యక్రమంలో జిల్లాలో చేపట్టిన తొలి విడుత పనులు చివరిదశకు చేరాయి. ప్రస్తుతం ఆయా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 898 పాఠశాలలు ఉండగా, ఈ కార్యక్రమం కింద మొదటి విడుతలో 316 ఎంపికయ్యాయి. దాదాపు అన్ని పాఠశాలల అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు ఇప్పటికే పూర్తయ్యింది. పనులన్నీ త్వరగా పూర్తిచేయించి విద్యార్థులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కలెక్టర్ మూనిత్యం పర్యవేక్షిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పనులు చివరిదశకు చేరాయి.
సీఎం కేసీఆర్ విద్యా రంగానికి పెద్దపీట వేశారు. భారీ బడ్జెట్‌ను కేటాయించారు. సర్కారు బడులను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తున్నారు. విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి కార్యక్రమం కింద సుమారుగా రూ.720కోట్ల బడ్జెట్ కేటాయించారు. జిల్లాలోని మొత్తం 898 పాఠశాలల్లో మొదటి విడుతలో 316 ఎంపికయ్యారు. అందులో ప్రాథమిక పాఠశాలలు 198, ప్రాథమికోన్నత పాఠశాలలు 42, జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలలు 76 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో మండలానికి రెండు చొప్పున ఎంపిక చేసి ఆదర్శ పాఠశాలలుగా ప్రకటించారు. వాటిల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పనులకు శంకుస్థాపన చేశారు. నాటి నుంచి పరుగులు పెట్టిస్తున్నారు. వాటిల్లో పనులను మొదటగా పూర్తి చేస్తున్నారు.
సర్కారు పాఠశాలల్లో అభివృద్ధి పనుల్లో అన్ని శాఖల అధికారులు భాగస్వాములవుతున్నారు. విద్యాశాఖలో డీఈవో మొదలుకుని జిల్లా కోఆర్డినేటర్లు, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు భాగస్వాములవుతున్నారు. కలెక్టర్ అధికారులతో 15రోజులకోసారి సమీక్ష నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు.
జిల్లాలో ‘మన ఊరు – మన బడి’లో తొలివిడుత ఎంపికైన పాఠశాలల్లో పనులు జోరుగా కొనసాగుతున్నాయి. అదనపు తరగతి గదుల నిర్మాణం, హైస్కూళ్లలో డైనింగ్‌హాల్ ప్రహరీలు, విద్యుత్ పనులు, తాగునీరు, మరుగుదొడ్లు, వంటశాల, మేజర్, మైనర్ పనులు చివరిదశకు చేరాయి. కొద్ది రోజుల్లో పెయింటింగ్ పనులు పూర్తయి పాఠశాలలు అద్దంలా మెరువనున్నాయి. ప్రహరీలు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు, మరుగుదొడ్లు, హ్యాండ్‌వాష్, తాగునీటి సంపు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి.