ఉద్యోగం, స్వయంఉపాధి పొందే వీలున్న కోర్సుల్లో ఐటీఐ ఒకటి. కేవలం పదో తరగతి విద్యార్హతతోనే నిరుద్యోగ యువతకు పుష్కలమైన అవకాశాలుండడం వల్ల దీనికి మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ వరంగల్ ములుగు రోడ్డులోని ఆర్టీసీ శిక్షణ కళాశాలలో కొత్తగా ఐటీఐ కాలేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, పెయింటర్, వెల్డర్.. ఇలా నాలుగు ట్రేడ్లతో 2022-23 విద్యాసంవత్సర అడ్మిషన్లు కూడా ప్రారంభించింది. ఇప్పటికే కొందరు విద్యార్థులు పలు కోర్సుల్లో చేరగా సోమవారం తరగతులను సైతం మొదలుపెట్టింది. ఆరెకరాల సువిశాలమైన స్థలంలో తరగతి గదులు, ఆడిటోరియం, 20 కంప్యూటర్లతో ల్యాబ్, మెకానికల్ రూమ్‌తో పాటు ప్రత్యేకంగా హాస్టల్ సౌకర్యం కల్పిస్తోంది. కోర్సు పూర్తయ్యాక అప్రెంటిస్ కూడా అందులోనే చేసే వెసులుబాటు ఉండడంతో ఎక్కువ మందిలో ఆసక్తి నెలకొంది.
హనుమకొండ చౌరస్తా : స్వయంఉపాధితో పాటు ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగం పొందేలా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో కొత్తగా వరంగల్‌లో ఐటీఐ కళాశాల అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ తర్వాత పెద్దనగరమైన వరంగల్‌లో 2వ ఆర్టీసీ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఏర్పాటుచేశారు. వీసీ సజ్జనార్ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్టీసీలో సమూలమార్పులు తీసుకొస్తున్నారు. వరంగల్ ములుగు రోడ్‌లోని ఆర్టీసీ శిక్షణ కళాశాలలో నూతనంగా ఐటీఐ కళాశాల ఏర్పాటుచేశారు. 90 సంవత్సరాలుగా రవాణా రంగంలో అత్యుత్తమ సేవలందిస్తూ విశేష ప్రజాదరణ చూరగొన్న ఆర్టీసీ ఆధ్వర్యంలో సువిశాలమైన ఆరెకరాల్లో ఆహ్లాదకర వాతావరణంలో అన్ని సౌకర్యాలతో ఐటీఐ కళాశాల ప్రారంభించారు. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, పెయింటర్, వెల్డర్ ఇలా నాలుగు ట్రేడ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల కోసం నాలుగు తరగతి గదులు, ఆడిటోరియం, మెకానికల్ రూమ్, 20 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా హాస్టల్ వసతి సౌకర్యాలను కల్పించనున్నారు. ఇందులో 18 గదులు, 72 బెడ్స్, డైనింగ్ హాల్, క్యాంటీన్, ప్రత్యేకంగా షటిల్ కోర్టు, కళాశాలలో కావాల్సిన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మూడో ఫేస్‌లో ఆర్టీసీ వరంగల్ ఐటీఐకి అఫిలియేషన్ ఇవ్వడంతో 2022-23 విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభించారు. ఇందులో డీజిల్ మెకానిక్-10, వెల్డర్-2 సీట్లను విద్యార్థులు పొందగా, సోమవారం నుంచి తరగతులు కూడా మొదలయ్యాయి.
ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో ప్రవేశం పొందితే ఉద్యోగం లేదా స్వయంఉపాధి పొందవచ్చనే నమ్మకంతో విద్యార్థులు ఐటీఐలోని వివిధ ట్రేడ్లలో చేరుతున్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కృషితో నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, భవితను అందించాలనే ఆశయంతో ఐటీఐని నెలకొల్పారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం పరికరాలు కూడా తెప్పించారు. ఆర్టీసీలో ఐటీఐ చేసినట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉండడం, అందులోనే అప్రెంటీస్ చేసే వెసులుబాటు ఉండడంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మిగిలిన సీట్ల కోసం వరంగల్ ములుగురోడ్‌లోని ఆర్టీసీ శిక్షణ కళాశాలలో సంప్రదించాలని, మరిన్ని వివరాలకు 0870-2982043, 8008136611, 7382855449 నంబర్లకు ఫోన్ చేయవచ్చని కోరారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఐటీఐకి మంచి డిమాండ్ ఉంది. ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్టీసీలో ఐటీఐ చేస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి. స్వయంఉపాధితో పాటు ఉద్యోగం సాధించవచ్చు. ఐటీఐ కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. ఇంకా సీట్లు పొందని వారికి మరో అవకాశం కల్పించేందుకు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం.
– వి.మోహన్‌రావు, ఆర్టీసీ వరంగల్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్
నూతనంగా వరంగల్‌లో ప్రారంభించిన ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో సీటు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆహ్లాదకర వాతావరణంలో శిక్షణ ఇస్తున్నారు. ప్రైవేట్ కంటే బాగుంది. మొదటిసారి ఏర్పాటుచేసిన కళాశాలలో అన్ని సౌకర్యాలున్నాయి.
– కొమ్మాల రాజేశ్, డీజిల్ మెకానిక్ విద్యారి
రైల్వేలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా. ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో డీజిల్ మెకానిక్ కోర్సులో చేరాను. ఇప్పుడు ఐటీఐకి ఎంతో డిమాండ్ ఉంది. అందుకే ఇందులో చేరాను. స్వయం ఉపాధి కూడా పొందవచ్చు.
– ఎం.శశికుమార్, హనుమకొండ